● నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తావా
● మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి: భూములు కబ్జాచేసేందుకే అధికార కాంగ్రెస్ పార్టీ 22ఏను తీసుకువచ్చిందని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లిలోని 106 ఎకరాల అటవీ భూములపై అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆ భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నించగా, అటవీశాఖ అధికారులతో మాట్లాడి సుప్రీంకోర్టులో కేసు వేయించి అటవీశాఖకే భూమి చెందేలా చూశానన్నారు. తాను 2023లో 1,400 ఎకరాలు, తాజాగా 106 ఎకరాలు కబ్జా చేశానని సీఎం నిరాధారమైన ఆరోపణలు చేశారన్నారు. తనపై చేసిన ఆరోపణలను నిరూపిస్తారా అని ప్రశ్నించారు. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో రాష్ట్రంలోని భూముల వ్యవహారాలపై సమగ్ర విచారణ చేపించాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.


