వ్యవసాయ భూమి పేరుతో ప్లాట్లు చేసే ప్రాజెక్టులపై దృష్టి
సాక్షి, వరంగల్: ‘వ్యవసాయ భూమి’.. ‘ఫామ్ ల్యాండ్’.. ‘ఆర్గానిక్ ఫామ్’.. ‘వీకెండ్ ఫామ్’.. పేర్లు వేరైనా వ్యాపారం మాత్రం ఒక్కటే. ఎకరాల కొద్ది వ్యవసాయ భూమిని సేకరించి రోడ్లు వేయడం, చిన్నచిన్న భాగాలుగా విభజించడం, భవిష్యత్ విలువ పెరుగుతుందని వినియోగదారులకు ప్లాట్లను విక్రయించడం.. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ విస్తరిస్తోంది. వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేసి విక్రయించే వ్యవహారాలపై రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఎస్‌ఎస్‌ఎల్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ వ్యవహారంలో తెలంగాణ రెరా, అనంతరం అప్పీళ్ల స్థాయిలో వెలువడిన తీర్పు నేపథ్యంలో ‘వ్యవసాయ భూమి కాబట్టి రెరా వర్తించదు’ అనే వాదనపై కొత్త చర్చ మొదలైంది. సేకరించిన భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లు లేదా రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగా మార్కెట్ చేస్తే కేవలం భూమి రికార్డులో ‘వ్యవసాయ’ంగా ఉండడం ఒక్కటే రెరా నుంచి తప్పించుకునే ఆధారం కాదన్న దిశలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రాజెక్టులో ఎనిమిదేళ్ల తర్వాత బైబ్యాక్ కింద రెట్టింపు మొత్తంతో పాటు 100 నెలల పాటు ఏటా రూ.1.92 లక్షలు లీజు ఇస్తామని, 2023 నుంచి లీజు మొత్తం చెల్లించకపోవడంతో ఓ వ్యక్తి రెరాలో ఫిర్యాదు చేయగా ఈ ఆదేశాలు రావడం గమనార్హం. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయభూముల పేరుతో రియల్ ఎస్టేట్ చేస్తున్న ప్రాజెక్టులను గుర్తించి, వాటిని రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్ చేసేందుకు చర్యలు తీసుకోవాలనడంతో ఉమ్మడి వరంగల్‌లోని వ్యవసాయ భూముల పేరుతో వెంచర్లు చేస్తున్న వారిలో వణుకు మొదలైంది. వందలాది ఎకరాల్లో.. రూ.కోట్లలో ఈవ్యాపారం జరుగుతుందనే చెప్పాలి.
కొనుగోలుదారుడికి లాభమేంటంటే?
రెరా పరిధిలోకి వచ్చే ప్రాజెక్టుకు రిజిస్ట్రేషన్ ఉంటే కొనుగోలుదారుడికి ఆమోదిత లేఔట్, ప్రాజెక్టు వివరాలు, అభివృద్ధి దశ, బుకింగ్ స్థితి, అనుమతులు తదితర వివరాలు ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు. అలాగే, ప్రాజెక్జు రిజిస్ట్రేషన్‌కు ముందు మార్కెటింగ్, బుకింగ్, విక్రయాలపై కూడా రెరా చట్టం నియంత్రణ ఉంటుంది. రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాజెక్టును ప్రచారం చేస్తే ప్రమోటర్‌పై చర్యలు, జరిమానా విధిస్తారు. టీజీ రెరా ప్రకారం ఉల్లంఘనకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 10 శాతం వరకు జరిమానా విధించే నిబంధన ఉంది. ఇటీవల రాష్ట్రంలో వ్యవసాయ భూమిని ‘ఫార్మ్ ప్లాట్లు’గా విభజించి, లేఅవుట్ అనుమతి, భూమి మార్పిడి, రెరా రిజిస్ట్రేషన్ లేకుండా విక్రయించిన వ్యవహారంలో టీజీ రెరా చర్యలు తీసుకుని జరిమానా విధించింది.
చట్టబద్ధమైన వెంచర్లకు
డిమాండ్..
ఇప్పటి వరకు ‘వ్యవసాయ భూమి’ పేరుతో తక్కువ ధరకు భూమి తీసుకుని, రోడ్లు, విద్యుత్, గేటెడ్ కమ్యూనిటీ, రిసార్టు, పార్కు, భవిష్యత్ విలువ వంటి అంశాలతో ప్రచారం చేసే మోడల్‌కు మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఇకపై ప్రాజెక్టు స్థాయి అభివృద్ధి ఉన్న చోట నియంత్రణ సంస్థల దృష్టి పెరగడంతో డెవలపర్లకు పత్రాలు, అనుమతులు, ప్రాజెక్టు వివరాలను స్పష్టంగా ఉంచాల్సిన అవసరముంది. దీంతో నిజంగా వ్యవసాయం కోసం భూమి కొనేవారు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ప్లాట్ కొనేవారు అనే తేడా కనిపించనుంది. అనుమతులు లేకుండా కేవలం భవిష్యత్ విలువ పేరుతో విక్రయించే ప్రాజెక్టులకు డిమాండ్ తగ్గి, చట్టబద్ధంగా అభివృద్ధి చేసిన వెంచర్లకు ప్రాధాన్యం పెరగవచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు భావిస్తున్నాయి.
2025 మార్చి వరకు
రెరా రిజిస్టర్ ప్రాజెక్టులు
(పాత జిల్లాల
గణాంకాల ప్రకారం)
427
14
29
26
12
మహబూబాబాద్
వరంగల్ అర్బన్
భూపాలపల్లి
వరంగల్ రూరల్
జనగామ
ప్రాజెక్టులు
జిల్లా
రెరా చట్టం కింద రిజిస్ట్రేషన్ చర్యలతో
ఒక్కసారిగా చర్చ
ఫలితంగా ఉమ్మడి వరంగల్‌లో
రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
తాజా చర్యలతో కొనుగోలుదారులకు మరింత రక్షణ
ఆరు జిల్లాల్లో
భూములకు డిమాండ్
వరంగల్, హనుమకొండ, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లోని పట్టణాల చుట్టుపక్కల భూములకు డిమాండ్ పెరుగుతోంది. రైతుల నుంచి పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసి వెంచర్లు చేసే సంస్కృతి పెరుగుతోంది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ‘వెంచర్’, ‘ఫామ్ ప్లాట్’, ‘గేటెడ్ ఫామ్’ వంటి పేర్లతో మార్కెటింగ్ చేసే ప్రాజెక్టులపై అధికారులు దృష్టి సారించే అవకాశం ఉంది.
అన్ని అంశాలను
పరిశీలించాలి
కొనుగోలుదారులకు ‘ప్లాట్ ఎక్కడ ఉంది?’ అన్నదానికంటే ‘ఆ ప్లాట్ ఏ అనుమతుల పరిధిలో ఉంది?’ అన్నదే కీలకం. రెరా నంబర్, ఆమోదిత లేఔట్, భూమి హక్కులు, భూమి వినియోగం, నిషేధిత జాబితా, ఎన్‌కంబరెన్స్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టడం సురక్షితం
– అజిత్‌రెడ్డి, కుడా పీఓ


