● సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి
భూపాలపల్లి అర్బన్: క్రీడలు మానసికోల్లాసంతో పాటు ఆరోగ్యం, క్రమశిక్షణ, టీమ్ వర్క్‌ను పెంపొందిస్తాయని ఏరియా సింగరేణి జీఎం ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కృష్ణకాలనీలోని అంబేడ్కర్ స్టేడియంలో డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో భూపాలపల్లి, రామగుండం–3 ఏరి యాల హాకీ రీజినల్ పోటీలకు జీఎం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ఆధునిక జీవన విధానంలో వర్క్–లైఫ్ బ్యాలెన్స్‌కు క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు. ఉద్యోగులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడలను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా మైనింగ్, ఎలక్ట్రికల్, మెకా నికల్ విభాగాల్లో గణనీయంగా మహిళా అధికారులు నియమితులయ్యారని తెలిపారు. మహిళలు పురుషులతో సమానంగా భూగర్భ గనుల్లో విధులు నిర్వహిస్తున్నారని, మహిళా రెస్క్యూ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామన్నారు. సింగరేణిలో అన్ని రంగాలతో పాటు క్రీడల్లోనూ మహిళా ఉద్యోగులు స్ఫూర్తిగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. త్వరలో జరిగే కోల్ ఇండియా క్రీడా పోటీల్లో సింగరేణిని అగ్రస్థానంలో నిలిపేందుకు క్రీడాకారులు ఆత్మవిశ్వాసంతో పతకాలు సాధించాలని కోరారు. క్రీడలను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను, పోటీల్లో పాల్గొంటున్న ఉద్యోగులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏరియా పర్సనల్ మేనేజర్ ఎస్.శ్యామ్‌సుందర్, క్రీడల గౌరవ కార్యదర్శి సాయికృష్ణ, గుర్తింపు సంఘం బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేశ్, ప్రాతినిథ్య సంఘం ఉపాధ్యక్షుడు బి.మధుకర్‌రెడ్డి, సీఎంఓఐ అధ్యక్షుడు నజీర్, స్పోర్ట్స్ సూపర్‌వైజర్ పర్స శ్రీనివాస్, భూపాలపల్లి స్పోర్ట్స్ కోఆర్డినేటర్ జి.నాగేశ్వర్‌రావు, ఆర్జీ–3 స్పోర్ట్స్ కోఆర్డినేటర్ బి.సదానందంతో పాటు క్రీడాకారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.


