రంగాపూర్‌ టు సింగపూర్‌ | - | Sakshi
Sakshi News home page

రంగాపూర్‌ టు సింగపూర్‌

Sep 11 2026 9:46 AM | Updated on Sep 11 2026 9:46 AM

– 8లోu

శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
ప్రభుత్వ బడి నుంచి అంతర్జాతీయ వేదికకు..

భూపాలపల్లి అర్బన్‌: మారుమూల గ్రామం నుంచి ఉపాధ్యాయుడిగా ప్రస్థానం ప్రారంభించి ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధికి కృషిచేస్తున్న తౌటం స్వామికి అంతర్జాతీయ విద్యా వేదికపై అధ్యయనం చేసే అవకాశం లభించింది. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీచర్స్‌ ఎక్స్‌పోసర్‌ విజిట్‌ అండ్‌ ఎడ్యుకేషనల్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రాం టు సింగపూర్‌కు జిల్లా నుంచి స్వామి ఎంపికయ్యారు. ఈ నెల 12నుంచి 19వరకు జరిగే పర్యటనలో సింగపూర్‌ విద్యావిధానం, బోధనా పద్ధతులు, విద్యార్థి కేంద్రీకృత అభ్యసనం, పాఠశాల నిర్వహణ తదితర అంశాలను అధ్యయనం చేయనున్నారు.

రంగాపూర్‌ నుంచి ప్రస్థానం

మొగుళ్లపల్లి మండలం రంగాపూర్‌కు చెందిన స్వామి డీఎస్సీ 2006 ద్వారా ఎస్జీటీగా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. చింతలపల్లి, అంకుషాపూర్‌, పరకాల మండలం నాగారం పాఠశాలల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం ఎంపీపీఎస్‌ జంగేడులో ఎస్జీటీగా సేవలందిస్తున్నారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే శిక్షకుడిగా, రిసోర్స్‌ పర్సన్‌గా, కంటెంట్‌ డెవలపర్‌గా విద్యాశాఖ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యారు.

ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమాల్లో కీలక పాత్ర

ప్రాథమిక విద్యలో అభ్యసన ప్రమాణాలను పెంపొందించే ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌పీ, డీఆర్‌పీగా పలు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీచర్స్‌ హ్యాండ్‌ బుక్స్‌(మాథ్యమెటిక్స్‌) రూపకల్పనలో కంటెంట్‌ డెవలపర్‌గా సేవలందించారు. ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో రూపొందించిన ఎన్‌ఏఎస్‌, ఎఫ్‌ఎల్‌ఎస్‌ ఐటెమ్‌ బ్యాంక్‌తో పాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను గురుకుల ప్రవేశ పరీక్షలకు సిద్ధం చేసేందుకు రూపొందించిన ‘సాధన’ మాడ్యూల్‌, రెకమండేషన్‌ మాడ్యల్‌ రూపకల్పనలోనూ భాగస్వామ్యమయ్యారు.

పలు అవార్డులు

2023లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఉత్తమ రిసోర్స్‌ పర్సన్‌ అవార్డు, 2024లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. జిల్లా స్థాయి ఎఫ్‌ఎల్‌ఎన్‌, టీఎల్‌ఎం మేళా గణిత విభాగంలో ప్రథమ బహుమతి సాధించారు.

సింగపూర్‌ నుంచి కొత్త పాఠాలు

కృత్యాధారిత బోధన, టీఎల్‌ఎం వినియోగం, పాటలు, ఆటలు, కృత్యాల ద్వారా విద్యార్థులను అభ్యసనలో భాగస్వాములను చేయడం స్వామి బోధనా విధానంలో ప్రత్యేకతగా నిలుస్తోంది. సింగపూర్‌ పర్యటనలో అక్కడి ఉత్తమ విద్యా పద్ధతులను అధ్యయనం చేసి, ప్రభుత్వ పాఠశాలలకు అన్వయించగల అంశాలను గుర్తించి తోటి ఉపాధ్యాయులతో పంచుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. స్వామి సింగపూర్‌ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపిక కావడంపై తోటి ఉపాధ్యాయులు, మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.

సింగపూర్‌ విద్యావిధాన అధ్యయనానికి తౌటం స్వామి ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement