● రెన్యువల్ ప్రీమియం చెల్లింపుపై సందిగ్ధం
● మరణాల నమోదుకు అనుమతి
● పరిహారం చెల్లింపుపై స్పష్టత కరువు
కాళేశ్వరం: రైతుబీమా పథకం రెన్యువల్ ప్రీమియం చెల్లింపులో చోటుచేసుకున్న తీవ్రజాప్యం అన్నదాతల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. 2025–26 సంవత్సర కాల పరిమితి ముగిసి నెలరోజులు అవుతున్నా 2026–27 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం కొనసాగుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరోవైపు ఆగస్టు 14 తర్వాత రైతుల మరణాలను నమోదు చేయాలని వ్యవసాయశాఖ ఆదేశిస్తున్నప్పటికీ పరిహారం అందుతుందో లేదోనన్న సందేహాలు క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
1,24,397 మంది రైతులు..
రైతు బీమా పథకానికి భూపాలపల్లి, కాటారం డివిజన్‌లో మొత్తం 1,24,397 మంది అర్హత కలిగిన రైతులు ఉన్నారు. వీరికి ప్రతీ సంవత్సరం ఒక్కో రైతు పేరిట ప్రభుత్వం రూ.3,500 ప్రీమియం చెల్లిస్తుంది. 2018–19 నుంచి 2025–26 వరకు మొత్తం 2,738 క్‌లైయిమ్‌లు నమోదు కాగా 2,685 పరిష్కారమయ్యాయి. ఒక్కో రైతు కుటుంబానికి రూ.5లక్షల చొప్పున జిల్లాలో 134.25 కోట్ల పరిహారం అందజేశారు.
మరణాల నమోదు
ఆగస్టు 14 నుంచి జరిగిన రైతుల మరణాలను నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఏఈఓ, ఏఓలకు ఆదేశాలు అందించినట్లు తెలిసింది. దీంతో క్షేత్రస్థాయిలో ఏఈఓలు, ఏఓలు గ్రామాల వారీగా మరణించిన రైతుల వివరాలను నమోదు చేస్తున్నారు. గతంలో రైతుబీమా పథకం కింద అర్హత కలిగిన రైతు ఏ కారణంతో మరణించినా, నామినీ ఖాతాలో రూ.5లక్షల బీమా పరిహారం జమ అయ్యేది. ఇంటి పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలకు ఈ మొత్తం ఆర్థికంగా కొంతమేర అండగా నిలిచేది. కానీ గత నెల 14నుంచి రైతు బీమాపై ప్రభుత్వం ఎలాంటి సర్క్యులర్ కూడా ఇవ్వలేదు.
మరణాల వివరాలు
రికార్డు చేస్తున్నాం
ఈ ఏడాది ఆగస్టు 14 తరువాత మరణించిన వారి వివరాలను ఏఈఓ, ఏఓలు నమోదు చేస్తున్నారు. రైతుల వివరాలను రికార్డు చేసి రిపోర్టు తయారు చేస్తున్నాం. రైతు బీమాపై సర్క్యులర్ రాలేదు. ప్రభుత్వ పాలసీ ప్రకారం సర్క్యులర్ వచ్చిన వెంటనే వివరాలను వెల్లడిస్తాం.
– జాడి బాబురావు,
జిల్లా వ్యవసాయ అధికారి


