భూపాలపల్లి అర్బన్: రైస్ మిల్లింగ్ పరిశ్రమలోని వాస్తవ సమస్యలను పట్టించుకోకుండా మిల్లర్లందరినీ డిఫాల్టర్లుగా చిత్రీకరించడం సరికాదని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పెరుమాళ్ల తిరుపతి, గౌరవ అధ్యక్షుడు కోరే రవి అన్నారు. గురువారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన మహాధర్నాలో వారు మాట్లాడారు. మిల్లింగ్‌లో సార్టెక్స్, అధిక బ్రోకెన్స్, అకాల వర్షాలు, తేమ తగ్గడం తదితర కారణాలతో 18–20 శాతం వరకు వాస్తవ నష్టాలు ఉంటాయని తెలిపారు. ముడి బియ్యం కోసం అదనంగా కేటాయించిన 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఉడికించిన బియ్యంగా మార్చేందుకు అనుమతించాలని, లేదంటే వేలం వేయాలని కోరారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని, డైనమిక్ క్రాప్ పాలసీ అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి యానం సంతోష్, ట్రెజరర్ రవీందర్‌రెడ్డి, సభ్యులు రాజు, సదానందం, భిక్షపతి, మహేందర్, శ్రీధర్ పాల్గొన్నారు.
ఆధునిక వ్యవసాయ
విధానాలపై ఆసక్తి
రేగొండ: రైతులు ఆధునిక, లాభాదాయకమైన వ్యవసాయ విధానాలను అవలంభించుకోవాలని అదనపు కలెక్టర్ ఎల్.విజయలక్ష్మి అన్నారు. గురువారం మండలంలోని కొడవటంచ గ్రామంలో సమీకృత ఫాంపాండ్ ద్వారా కలిగే ప్రయోజనాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, పంటల వైవిద్యీకరణపై రైతులకు అవగాహన కల్పించారు. పశువుల పెంపకం, భూగర్భ జలాల పెంపు, హార్టికల్చర్, డ్రాగన్స్ ప్రూట్ సాగు వంటి కార్యక్రమాల ద్వారా రైతులు అదనపు ఆదాయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. రైతులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పధకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం రేగొండ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏపీఓ జామీర్‌పాషా, అధికారులు పాల్గొన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
రేగొండ: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ అన్నారు. గురువారం రాజక్కపల్లిలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఆయన సందర్శించారు. అక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కాలానికి అనుగుణంగా వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. దోమల వృద్ధిని అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏమైనా వ్యాధుల లక్షణాలు కనిపించినట్లతే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించి తగిన వైద్యం పొందాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.


