భూపాలపల్లి: జిల్లాలో టీబీ నిర్మూలనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, ప్రతీ అనుమానితుడికి పరీక్షలు తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మొబైల్ ఎక్స్‌రే వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, డీఆర్‌ఓ వసంతకుమారి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు
ప్రగతి నివేదికలు అందించాలి..
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు తమ ప్రగతి నివేదికలను ఈ నెల 7వ తేదీ నాటికి అందజేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణ, ఏర్పాట్లపై ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా శాఖల ద్వారా సాధించిన పురోగతి, అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు సంబంధించిన పూర్తి నివేదికలను డీపీఆర్‌ఓ శీలం శ్రీనివాస్‌కు సకాలంలో అందించాలని ఆదేశించారు.
99.55 శాతం డిజిటలైజేషన్ పూర్తి..
సర్‌లో భాగంగా జిల్లాలో డిజిటలైజేషన్ ప్రక్రియ 99.55శాతం జరిగిందని కలెక్టర్ రాహుల్‌శర్మ వెల్లడించారు. హైదరాబాద్ ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ తదితర అంశాలపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేసిన అనంతరం జిల్లాలో సవరణ ప్రక్రియ వివరాలను కలెక్టర్ వెల్లడించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్, విజయలక్ష్మి, ఆర్డీఓ హరిక్రిష్ణ పాల్గొన్నారు.
ప్రతీ అనుమానితుడికి పరీక్షలు తప్పనిసరి
కలెక్టర్ రాహుల్ శర్మ


