● మహదేవపూర్ సామాజిక
ఆస్పత్రిని పునర్నిర్మిస్తాం
● రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కాళేశ్వరం: మారుమూల ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం మహదేవపూర్ సామాజిక ఆస్పత్రిలో ఐడీబీఐ సహకారంతో హైదరాబాద్ ఎంఎన్‌జీ ఆస్పత్రి, కరీంనగర్ ఒమెగా ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బందితో ఉచిత క్యాన్సర్, కంటి నిర్దారణ పరీక్షలు వైద్య శిబిరాన్ని, హెల్త్ ఏటీఎంను మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. తన మేనత్త వనమాల ఇటీవల మృతిచెందగా ఆమె జ్ఞాపకార్ధం వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యంగా మహిళలు క్యాన్సర్ బారిన పడకుండా రాష్ట్ర వ్యాప్తంగా సర్వైకల్ పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ప్రజల సౌకర్యార్థం ఆగస్టు 4వ తేదీన ఎంఎన్‌జే ఆస్పత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాశ్‌రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీకాంత్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఆర్డీఓ రవీందర్, శిక్షణ డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ పంతకాని తిరుమల తదితరులు పాల్గొన్నారు.


