కాళేశ్వరం: కాళేశ్వరంలో వచ్చే ఏడాది జూన్ 26నుంచి జూలై 7వరకు జరుగు గోదావరి పుష్కరాల కోసం అష్టతీర్థాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.60కోట్లు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జూలై 23 నుంచి ఆన్‌లైన్ టెండర్ బిడ్‌లు వేస్తున్నారు. ఆగస్టు 7న టెండర్ ఓపెన్ చేయనున్నారని తెలిసింది. దీంతో పక్షితీర్థం నుంచి హనుమత్ తీర్థం వరకు 3.5కిలోమీటర్ల దూరం అంతర్రాష్ట్ర వంతెన వరకు ఘాట్లు, వివిధ విగ్రహాల ఏర్పాటు కానుంది. ఇప్పటికే ఇరిగేషన్‌శాఖ, ఆర్కిటెక్చర్ల బృందం పరిశీలనలు చేసిన విషయం తెలిసిందే. నిర్మాణాలతో కాళేశ్వరాలయానికి కొత్త శోభ రానుంది.
గురువుల పాత్ర గొప్పది
ములుగు రూరల్: సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర గొప్పదని, గురువులు సమాజానికి మార్గదర్శకులని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ములుగు పట్టణంలోని రాయల్ ప్లాజాలో ఉపాధ్యాయులు, వైద్యులు, సామాజిక సేవకుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేవా రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచారి, ఎర్రంకాని యోగి రాంబాబు, చల్లగురువుల మల్లయ్య, బానోత్ రాజేశ్వరి, అన్నపురెడ్డి మౌనిక, గడ్డె శిరీషను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ (ధార్మిక సెల్) జిల్లా కన్వీనర్ రేగూరి రాజిరెడ్డి, కర్ర శ్రీనివాస్, గుంటుక విజయ, కొత్తపల్లి రాజకుమారి, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జవహర్‌లాల్ పాల్గొన్నారు.
స్కాన్ చెయ్..
అవినీతిని కడిగెయ్
కాశిబుగ్గ: ‘ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే కింద ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఏసీబీకి ఆన్‌లైన్‌లో కంప్లైంట్ చేయండి’ అంటూ ఎంజీఎంలో పలు చోట్ల క్యూ ఆర్ కోడ్‌ల పోస్టర్లు అతికించారు. ఈమేరకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఈ వినూత్న ఏర్పాటు చేశారు. ఎంజీఎంలో దాదాపు 30 చోట్ల స్టిక్కర్లు అంటించి అవినీతి జరగకుండా చూసేందుకు ఏర్పాట్లు చేశారు. క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి ఫిర్యాదు చేస్తే ఏసీబీ అఽధికారులు రహస్యంగా వచ్చి డబ్బులు అడిగినవారిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని వారు వివరించారు.
శాకంబరుడిగా
రుద్రేశ్వరస్వామి
హన్మకొండ
కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో బుధవారం ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురుపౌర్ణమిని పురస్కరించుకుని రుద్రేశ్వరస్వామిని శాకంబరుడిగా అలంకరించారు. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేద పండితులు మణికంఠశర్మ అవధాని, అర్చకులు ప్రణవ్, శ్రవణ్ ప్రభాత సేవ, గణపతి ఆరాధన, రుద్రేశ్వర శివలింగానికి రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పలుగ్రామాల నుంచి రైతులు అందించిన వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో స్వామివారిని శాకంబరుడిగా అలంకరించి మహాహారతి జరిపి భక్తులకు దర్శనానికి అనుమతించారు. పూజల్లో దేవాదాయశాఖ మాజీ కమిషనర్ అనిల్‌కుమార్, పద్మజ దంపతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రుద్రేశ్వరసేవా సమితి సభ్యులు శ్రీనివాస్, జ్యోతి, అంజనేయులు, భువనగిరి మాధవరావు, వంశీ తదితరులు కూరగాయలు అందజేసిన వారిలో ఉన్నారు. ఆలయ ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.


