గణపురం: గణపసముద్రం చెరువు ఆయకట్టు కాల్వల అభివృద్ధికి ప్రభుత్వం రూ.31కోట్ల నిధులు మంజూరుచేసినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని రైతువేదికలో 100 రోజుల రైతు నేస్తం ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫ్‌రెన్స్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ ఆయకట్టు కాల్వల టెండర్ ప్రక్రియ త్వరలో పూర్తిచేసి 12 నెలల్లో పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ రాహుల్‌శర్మ మాట్లాడుతూ ప్రకృతి వైపరిత్యాలు తట్టుకొని అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని రైతులకు సూచించారు. భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితి ఉండడంతో తక్కువ నీటితో పండే పంటలు పండించాలన్నారు. ఉద్యాన, అంతర పంటలు వేసి అధిక లాభాలు పొందాలన్నారు. అనంతరం రైతులకు కూరగాయల విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, ఏడీఏ రమేశ్, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, ఎంపీడీఓ భాస్కర్, తెలంగాణ రైతు విజ్ఞాన వేదిక శాస్త్రవేత్త డాక్టర్ విశ్వతేజ పాల్గొన్నారు.
భూపాలపల్లి ఎమ్మెల్యే
గండ్ర సత్యనారాయణరావు


