భూపాలపల్లి అర్బన్: మందుబాబులు మద్యం మత్తులో ఉండటాన్ని ఆసరా చేసుకొని జిల్లాలోని కొన్ని బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు నాసిరకం ఆహార పదార్థాలు అంటగడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పర్యవేక్షించే వారు, పట్టించుకొనే వారు కరువవడంతో ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. మరో వైపు బార్‌ల నిర్వహణలో సమయపాలనను పాటించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. తెల్లారే దాకా నిర్వహిస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని తెలుస్తోంది. దీంతో మందు బాబుల మధ్య ఘర్షణలతో ఆయా ప్రాంతాల్లో భయానక పరిస్థితి నెలకొంటుంది.
ధర ఎక్కువ.. నాణ్యత తక్కువ
జిల్లా కేంద్రం కావడంతో భూపాలపల్లికి గతం కంటే రాకపోకలు పెరిగాయి. ఈ క్రమంలో బార్ అండ్ రెస్టారెంట్ల వ్యాపారం జోరందుకోవడంతో నిత్యం మందుబాబులతో కిటకిటలాడుతున్నాయి. మద్యం సేవిస్తున్న సమయంలో ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకోవడం పరిపాటి. అయితే, వారికి బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు కలుషిత, నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పైకి హంగూ ఆర్భాటం కనిపిస్తున్నా.. వండేది మాత్రం పూర్తిగా కల్తీనే అని తెలుస్తోంది. రెండు మూడు రోజులపాటు నిల్వ చేసిన ఆహారాన్ని అమ్ముతున్నారని సమాచారం. ఇటీవల ఓ రెస్టారెంట్లో మందుబాబులు, నిర్వాహకుల మధ్య ఆహారం విషయంలో వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ధరల విషయంలో చూపించే శ్రద్ధ నాణ్యతలో చూపడం లేదని పలువురు మందుబాబులు మండిపడుతున్నారు.
నిబంధనలు బేఖాతర్
బార్ అండ్ రెస్టారెంట్లలో వండే ఆహారంలో సరుకులకు ఏరోజుకారోజు వినియోగించాల్సి ఉంది. వాడిన నూనె మళ్లీ వాడొద్దు. భోజనం తయారు చేసే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలి. వినియోగదారులు మిగిల్చిన ఆహారాన్ని వెంటనే పడేయాలి. ఆహార పదార్థాలు, మాంసం మిగిలితే వాటిని ఫ్రీడ్జిలో పెట్టి నిల్వ చేయొద్దు. అలాగే బార్ అండ్ రెస్టారెంట్లను ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటలకు తెరిచి ఉంచాలి. సమయం దాటాక మందు విక్రయాలు జరపొద్దనే నిబంధనలు ఉన్నాయి. అయినా అవేమీ అమలు కావడం లేదని తెలుస్తోంది.
పర్యవేక్షణ శూన్యం
జిల్లాలోని బార్ అండ్ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల నిఘా ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇష్టానుసారంగా విక్రయాలు జరుగుతున్నా ఎకై ్సజ్ అధికారులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఎకై ్సజ్ అధికారులు బార్ల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవనే విమర్శలు ఉన్నాయి. నిర్వాహకులకు కొందరు అధికారులే వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే బహిరంగ ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
మత్తులో అధికారులు..
జిల్లా కేంద్రంలోని బార్ అండ్ రెస్టారెంట్లపై అధికారులు తనిఖీలు చేసిన సందర్భాలు చాలా అరుదు. బార్లలో లూజు మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. అందులో భాగంగా లూజు మద్యంలో కల్తీ చేసిన మద్యం విక్రయాలు, ధర ఎక్కువ ఉన్న మద్యానికి బదులుగా తక్కువ ధర కలిగిన మద్యాన్ని ఇస్తున్నారని పలువురు మద్యం ప్రియులు ఆరోపిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రతీ నెల నిర్వాహకుల నుంచి మామూళ్లు తీసుకుంటూ అటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కిరణ్‌ని వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
నిబంధనలు పాటించని
బార్ అండ్ రెస్టారెంట్లు
జోరుగా నాణ్యతలేని
ఆహార పదార్థాల విక్రయాలు
కనీస ప్రమాణాలు పాటించని
నిర్వాహకులు
పట్టించుకోని సంబంధిత అధికారులు


