భూపాలపల్లి: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జిల్లాలోని 12 రైతు వేదికల్లో విత్తన మేళా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిందని తెలి పారు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించడం ఈ విత్తన మేళా ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. తక్కువ నీటితో ఎక్కువ లాభం పొందే ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని సూచించారు. రైతులు సంప్రదాయ వరి సాగుకు బదులుగా ఇతర పంటలను సాగు చేస్తే వర్షాభావ పరిస్థితుల్లోనూ నష్టపోకుండా లాభపడవచ్చని పేర్కొన్నారు. మేళాలో నాణ్యమైన విత్తనాలు కంది, పెసర, మినుము, మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
మేళా నిర్వహించే రైతు వేదికలు ఇవే..
భూపాలపల్లి మండలంలో పెద్దాపూర్, ఘన్‌పూర్‌లో ఘన్‌పూర్, రేగొండలో రేగొండ, కొత్తపల్లిగోరిలో సుల్తాన్‌పూర్, చిట్యాలలో చిట్యాల, మొగుళ్లపల్లిలో మొగుళ్లపల్లి, టేకుమట్లలో టేకుమట్ల, మల్హర్‌లో తాడిచర్ల, కాటారంలో కాటారం, మహదేవపూర్‌లో బొమ్మపూర్, మహాముత్తారంలో బోర్లగూడెం, పలిమెల గ్రామ పంచాయతీ కార్యాలయంలో విత్తమేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలనుకునే రైతులు తమ సమీప రైతు వేదికలను సందర్శించి, అక్కడ అందుబాటులో ఉండే వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు సరైన విత్తనాలను పొందాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.


