మల్హర్: మండలంలోని తాడిచర్ల ఓపెన్‌కాస్ట్ మైన్‌ను మంగళవారం టీజీ జెన్‌కో కోల్–లాజిస్టిక్స్ డైరెక్టర్ బి.నాగియ సందర్శించారు. ఈ సందర్భంగా గని ప్రాంగణంలో సీనియర్ అధికారులు ప్రెజెంటేషన్ ద్వారా మైన్ ప్రస్తుత పరిస్థితి, బొగ్గు ఉత్పత్తి వివరాలు, నివేదికలను డైరెక్టర్ నాగియకు వివరించారు. గని ప్రాంగణంలోని వ్యూ పాయింట్ నుంచి ప్రత్యక్షంగా మైనింగ్ పనులను వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచడానికి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జెన్‌కో జనరల్ మేనేజర్ మోహన్‌రావు, ఏఎమ్మార్ అధికారులు పాల్గొన్నారు.
యాంటీ డ్రగ్స్‌పై అవగాహన
భూపాలపల్లి అర్బన్: ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి.రమేష్‌కుమార్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శ్రీకాంత్ ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థులకు డ్రగ్స్‌తో కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ ఎం.సదానందం, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బి.రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
కాళేశ్వరంలో
అష్టతీర్థాలకు శ్రీకారం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని పూర్వపు అష్టతీర్థాలకు రూ.60కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఆర్కిటెక్చర్ బృందం కాళేశ్వరంలో పర్యటించి అష్టతీర్థాలపై సర్వే చేపట్టింది. అష్ట తీర్థాలను అభివృద్ధి చేసి ఘాట్ల నిర్మాణం చేపట్టడానికి ప్రణాళికలు రూపొందించారు. వీఐపీ ఘాట్‌లోని సంగమ తీర్థం ఇప్పటికే అభివృద్ధి చేశారు. వచ్చే ఏడాది జూన్ 26నుంచి జూలై 7 వరకు జరుగు గోదావరి నది పుష్కరాల వరకు నిర్మాణాలు చేపట్టడానికి సన్నద్ధమయ్యారని తెలిసింది. ప్రస్తుతమున్న సరస్వతీఘాటు ఎగువన ఉన్న పక్షి తీర్థం నుంచి హనుమత్ తీర్థం అంతర్రాష్ట్ర వంతెన వరకు 3.5 కిలోమీటర్ల మేర ఘాట్ల తీర్థాఽలను కలుపుతూ బండ్ నిర్మాణాలు చేపట్టడానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆయా బండ్‌ల వద్ద ఆయా తీర్థాలకు సంబంధించిన ప్రత్యేకమైన విగ్రహాలను ఏర్పాటు చేస్తారని దేవాదాయశాఖ, ఆర్కిటెక్చర్ల బృందం పేర్కొంది.
ఎన్‌ఎంఎంఎస్
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ ఎంపికకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ విద్యాఽశాఖ అధికారి రాజేందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు, 9 నుంచి ఇంటర్మీడియట్ వరకు మెరిట్ స్కాలర్‌షిప్ పొందేందుకు నిర్వహించే నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ పరీక్షకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తెలిపారు. ఈ పరీక్షకు దరఖాస్తుల స్వీకరణకు ఆగస్టు 24 వరకు తుది గడువుగా ఉందన్నారు.నవంబర్ 1న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రెసిడెన్షియల్ విధానంలో కొనసాగుతున్న పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు కాదని స్పష్టం చేశారు.


