ఏటూరునాగారం: కాళేశ్వరం బ్యారేజ్ ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, సుందిళ్ల, కన్నెపల్లి ఇతర పంపుహౌజ్‌లలో నీటిని నింపకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుక దోపిడీకి పాల్పడుతుందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు అన్నారు. మండల కేంద్రంలోని తన ఇంటి వద్ద బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సునీల్‌కుమార్ అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కన్నెపల్లి వద్ద లక్ష క్యూసెక్కుల నీటిని వృఽథాగా దిగువకు వదులుతుందన్నారు. మేడిగడ్డ వద్ద పగుళ్లు వచ్చిన పిల్లర్లకు మరమ్మతులు చేసుకోవాలని నేషనల్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఏడాదిన్నర క్రితమే చెప్పినా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీతక్కకు పనులు చేయించేందుకు కంకర, సిమెంట్ దొరకడం లేదా అని ఎద్దేవా చేశారు. కేవలం బ్యారేజ్‌లలో నీరు నింపితే ఇసుకను తోడుకునే అవకాశం ఉండదని భావించిన ప్రభుత్వం నీరు నింపకుండా ఇసుకను తోడుకుంటుందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నం చేసి కాళేశ్వరాన్ని కడితే కూలేశ్వరమని మంత్రి సీతక్క మాట్లాడడం బాధాకరమన్నారు. సీతమ్మ సాగర్ కింద బ్యాక్ వాటర్‌లో ఇసుక కలిసిపోతుందని తప్పుడు నివేదికలతో చేపట్టిన డిసిల్టేషన్‌ను అడ్డుకొని తీరుతామన్నారు. మంగపేట మండలం కత్తిగూడెం వద్ద శివగంగ ప్రాజెక్టు నిర్మించకుండా ఇసుకను తోడుకునేందుకు సీతమ్మ సాగర్‌ను తెరపైకి తెచ్చారని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు తాటి కృష్ణ, తుమ్మ మల్లారెడ్డి, వలిబాబా, ప్రదీప్‌రావు, అశోక్ గౌడ్, ధనలక్ష్మి, నాగ రమేశ్, లక్ష్మణరావు, ఎండి కుర్బాన్ అలి, రఘు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు


