● జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ సిద్ధార్థరెడ్డి
భూపాలపల్లి అర్బన్: యువత ఆవిష్కరణలతోనే పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా పరిశ్రమలశాఖ మేనేజర్ సిద్దార్ధరెడ్డి తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సామల గార్డెన్‌లో సోమవారం నిర్వహించిన తేజస్ వర్క్‌షాప్‌లో సిద్ధార్థరెడ్డి పాల్గొని మాట్లాడారు. యువతలోని వినూత్న ఆలోచనలకు ప్రోత్సాహం, కొత్త సాంకేతికత వినియోగం ద్వారానే రాష్ట్రం, దేశం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. వర్క్‌షాప్‌లో ప్రతినిధులు డీపీఐఐటీ ఆన్‌లైన్ ద్వారా స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అవగాహన కల్పించారు. టీజీఐసీ, ఆర్‌ఐసీహెచ్, ఎంఎస్‌ఎంఈ ప్రతినిధులు స్టార్టప్‌ల ఏర్పాటు, పరిశోధనలను మార్కెట్‌కు తీసుకెళ్లే విధానం, ప్రభుత్వ పథకాలు, రాయితీలు, స్వయం ఉపాధి అవకాశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొని నిపుణులతో సందేహాలను నివృత్తి చేసుకున్నారు.


