భూపాలపల్లి: రాష్ట్రంలోనే అత్యధిక అడవులు కలిగి ఉన్న కాళేశ్వరం సర్కిల్‌ను అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. సరిపడా రేంజ్, సెక్షన్, బీట్ ఆఫీసర్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక్కో అధికారి రెండు, మూడు బీట్ల బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా పోడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ఐదు జిల్లాల్లో 562 ఖాళీలు..
కాళేశ్వరం సర్కిల్ పరిధిలో భూపాలపల్లి, ములుగు, పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. కాళేశ్వరం సర్కిల్ పరిధిలో భూపాలపల్లి జిల్లాలో 9 రేంజ్‌లు, 42 సెక్షన్లు, 170 బీట్లు ఉన్నాయి. ములుగు జిల్లాలో 13 రేంజ్‌లు, 60 సెక్షన్లు, 310 బీట్లు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లాలో 3 రేంజ్‌లు, 12 సెక్షన్లు, 35 బీట్లు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాలో 15 రేంజ్‌లు, 70 సెక్షన్లు, 230 బీట్లు ఉన్నాయి. కొమురంభీం జిల్లాలో 12 రేంజ్‌లు, 85 సెక్షన్లు, 250 బీట్లు ఉన్నాయి. ఆయా జిల్లాల పరిధిలో 52 రేంజ్‌లు ఉండగా రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ స్థానాలు 20 చొప్పున ఖాళీగా ఉన్నాయి. బీట్ ఆఫీసర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఐదు జిల్లాల్లో 995 స్థానాలకు గాను 522 ఖాళీగా ఉన్నాయి. దీంతో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడం ఇబ్బందికరంగా మారింది. ఒక్కో బీట్ కిలోమీటర్ల పరిధి విస్తరించి ఉండటం, ఒక బీట్ ఆఫీసర్‌కు రెండు, మూడు బీట్ల బాధ్యతలు అదనంగా అప్పగించడంతో పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కరువైంది. ఫూట్ పెట్రోలింగ్ చేసే వారే కరువయ్యారు.
తెరపైకి పోడు సెగలు..
ప్రస్తుతం తొలకరి పలకరించడంతో ఐదు జిల్లాల పరిధిలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. ప్రతీ ఏటా ఈ సమయం అటవీశాఖకు సవాల్‌గా మారుతుంది. గతంలో పోడు చేసిన వారు, పోడు కోసం చెట్లు నరికి భూమి పొతం చేసిన సాగు కోసం ప్రయత్నిస్తారు. ఈ సమయంలోనే అటవీశాఖ అధికారులు, సిబ్బంది కొరత ఉండటంతో పోడు పెరిగే ప్రమాదం ఉంది. కాళేశ్వరం సర్కిల్ పరిధిలో ప్రధానంగా భూపాలపల్లి, ములుగు, కొమురంభీం జిల్లాలో పోడు లొల్లులు తీవ్రంగా ఉంటాయి. పోడుదారులు, అటవీశాఖ అధికారుల మధ్య పరస్పర దాడులు ప్రతీ ఏటా జరుగుతూనే ఉన్నాయి. అధికారులు, సిబ్బంది కొరత లేకుంటే పోడు సమస్య తలెత్తకుండా చూసుకునే అవకాశాలు ఉన్నాయి.
కాళేశ్వరం సర్కిల్ పరిధిలో
భారీగా ఖాళీలు
భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
అదనపు భారంతో అధికారుల ఇబ్బందులు
ప్రస్తుతం పోడు జరిగే వేళ తప్పని తిప్పలు
జిల్లా రేంజర్లు సెక్షన్ బీట్
ఆఫీసర్లు ఆఫీసర్లు
భూపాలపల్లి 0 08 100
ములుగు 08 05 160
పెద్దపల్లి 01 0 22
మంచిర్యాల 07 06 120
కొమురంభీం 04 01 120


