రిజర్వేషన్ ఏం వస్తదో..
జిల్లాకేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికలపైనే చర్చ
అభ్యర్థుల ఎంపికపై పార్టీల దృష్టి
భూపాలపల్లి అర్బన్: పురపోరు ముంచుకొస్తున్న తరుణంలో జిల్లాకేంద్రంలో అందరి నోటా రిజర్వేషన్ మాటే వినిపిస్తోంది. వార్డులకు ఏం రిజర్వేషన్ వస్తదో అనే ఆలోచనల్లో ఆశావహులు ఉన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీ జనరల్‌కు రిజర్వ్ అవుతుందనే వార్తలు అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తున్నాయి. కొంతమంది బీసీ, మళ్లీ ఎస్సీకి రిజర్వేషన్ వచ్చి చైర్మన్ గిరి దక్కే అవకాశం ఉందంటూ జోస్యం చెబుతున్నారు. అన్ని పార్టీలు రిజర్వేషన్ ఏం వచ్చినా అందుకు తగ్గట్లుగానే ముందే ప్రణాళికలు వేసుకుంటున్నారు. పోటీలో నిలవాలని అనుకుంటున్న ఆశావహలు మున్సిపాలిటీకి కట్టే పన్నులను చెల్లించే పనిలో ఉన్నారు. ఇవన్నీ ఒకెత్తయితే అభ్యర్థుల ఎంపికకు సరిపడే సమయం ఉంటుందా లేదా అనే ఆలోచనలో అన్ని పార్టీల ముఖ్య నాయకులు ఉన్నారు. రిజర్వేషన్ నామినేషన్‌కు మధ్య ఎక్కువ రోజుల సమయం ఉండకపోవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి.
పోటీకి ఆసక్తి..
జిల్లాలో ఒకే ఒక్క మున్సిపాలిటీ భూపాలపల్లి ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. జిల్లా కేంద్రం కావడం, వార్డుల సంఖ్య 30 వార్డులు ఉండటంతో చాలామంది ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆశావహులు మాత్రం అందరూ రిజర్వేషన్ల కోసం ఉత్కంఠగా ఎదరుచూస్తున్నారు. రిజర్వేషన్ తేలితేనే పోటీపై స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. రిజర్వేషన్ వెల్లడించిన తర్వాత నామినేషన్‌కు మధ్యలో సమయం పెద్దగా ఉండకపోవచ్చని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఓటర్ల జాబితా తయారీ షెడ్యూల్ ప్రకారం గురువారం వార్డు ఓటరు తొలి జాబితాను విడుదల చేశారు. 5వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. 10వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రదర్శన అనంతరమే రిజర్వేషన్ వెల్లడించే అవకాశం ఉంది. 10న తుది ఓటర్ల జాబితా వెల్లడిస్తే 11, 12వ తేదీల్లో రిజర్వేషన్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇలా చూస్తే రిజర్వేషన్‌కు నామినేషన్ల ప్రారంభానికి మధ్యలో రెండు, మూడు రోజుల సమయం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఈ అంశమే అన్ని పార్టీలను కలవరపెడుతోంది.
జంపింగ్‌లకు చెక్ పెట్టేలా..
రిజర్వేషన్ల కేటాయింపు నామినేషన్లకు మధ్య తక్కువ సమయం ఉండటం అసంతృప్త నాయకులు ఇతర పార్టీల్లోకి వెళ్లే అవకాశాలకు చెక్‌పెట్టే విధంగా కలిసి వచ్చింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో వార్డుకు ఇద్దరి కన్నా ఎక్కువ మంది టికెట్‌ను ఆశిస్తున్నారు. ఒకవేళ టికెట్ రాకపోతే బీజేపీ, బీఆర్‌ఎస్, ఇతర పార్టీని ఆశ్రయించే అవకాశం ఉంది. మిగతా పార్టీలు కూడా ఇతర పార్టీల నాయకులను చేర్చుకుని బలపడే ఆలోచనలో ఉన్నాయి.
వార్డుకు ఐదారుగురు పేర్లను పరిశీలిస్తున్న పార్టీలు
రిజర్వేషన్, నామినేషన్ల మధ్య
ఒకటి రెండు రోజులే ఉండే అవకాశం
రిజర్వేషన్లకు నామినేషన్లకు మధ్యలో పెద్దగా సమయం ఉండే అవకాశం లేకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. వార్డుల వారీగా అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. రిజర్వేషన్ అనుకూలించినా లేకపోయినా ముందుజాగ్రత్తగా ప్రతీవార్డుకు కులాల వారీగా అభ్యర్థులను ఎంపికచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు వార్డుల వారీగా పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ఆశావహుల జాబితాను తయారు చేసుకున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ బయటకు చెప్పకపోయినా ఇప్పటికే అభ్యర్థులపై క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐలు కూడా ముందుగానే అభ్యర్థులను ఎంపికచేసే పనిలో ఉన్నాయి.
రిజర్వేషన్ ఏం వస్తదో..


