
అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించిన సబ్ కలెక్టర్
కాటారం: కాటారం మండలం శంకరాంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని గురువారం కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ పరిశీలించారు. భారీ వర్షం కురిసినప్పుడు వరద నీరు అంగన్‌వాడీ కేంద్రంలోకి చేరడంతో చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారని పలువురు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆయన సీడీపీఓ రాధికతో కలిసి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి భవనం పరిస్థితి, చిన్నారుల ఇబ్బందిపై ఆరా తీశారు. రోడ్డు ఎత్తుగా ఉండటం, కేంద్రం చుట్టూ నీరు నిలిచి ఉండటాన్ని గమనించిన సబ్ కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని పీఆర్ డీఈ సాయిలును ఆదేశించారు. శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని సీడీపీఓ, అంగన్‌వాడీ టీచర్ సువర్ణ సబ్ కలెక్టర్‌ను కోరారు. గ్రామంలో డ్రెయినేజీ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరగా.. నివేదిక తయారు చేయాలని సబ్ కలెక్టర్ అధికారులకు సూచించారు. సబ్ కలెక్టర్ వెంట పీఆర్ ఏఈ సతీశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు.