
ఆరోగ్య శిబిరం.. సత్ఫలితం
వైద్య శిబిరాల్లో కేసుల వివరాలు
వైద్య శిబిరాలు : 25
టీబీ పరీక్షలు చేసింది : 6078
టీబీ లక్షణాలు ఉన్నది : 392
హెచ్‌ఐవీ పరీక్షలు : 1191
పాజిటివ్ నిర్దారణ : 09
మధుమేహవ్యాధి నిర్ధారణ : 105
రక్తపోటు గుర్తింపు : 172
భూపాలపల్లి అర్బన్: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా 2030 నాటికి క్షయను సంపూర్ణంగా నివారించాలన్న ఆశయంతో కేంద్ర ప్రభుత్వం వంద రోజుల సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తుంది. క్షయవ్యాధి నిర్ధారణ కోసం జిల్లావ్యాప్తంగా ప్రతీ గ్రామం, పట్టణాల్లోని వార్డుల్లో ప్రతీ రోజు ఒక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. క్షయ, హెచ్‌ఐవీ, హెపటైటిస్ బీ, మధుమేహం, బీపీ వంటి పరీక్షలు చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే సమయం కావడంతో జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాల్లో జ్వరం, జలుబు, దగ్గు వంటి వ్యాధులకూ పరీక్షలు చేస్తున్నారు. ఫలితంగా సీజనల్ వ్యాధుల ప్రభావం జిల్లాలో కొంతమేర తగ్గింది. సమగ్ర ఆరోగ్య శిబిరాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల్లో వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి.. పలు రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. క్షయవ్యాధిపై అనుమానం ఉన్నవారిని ఎక్స్‌రే కోసం 102 వాహనాల్లో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి అక్కడి నుంచి ఇంటికి తరలిస్తున్నారు.
సీజనల్ వ్యాధులపై అవగాహన
ఆరోగ్య శిబిరాలతో పాటు వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వర్షాలు కురుస్తుండడంతో నీటిని వేడి చేసి చల్లార్చి తాగాలని, వేడి ఆహారాన్ని తీసుకోవాలని, బయటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని, ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలని వివరిస్తున్నారు. దోమల వృద్ధికి కారణమయ్యే నీటి నిల్వ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ప్రతీ శుక్రవారం డ్రైడే పాటించడం, ఇంట్లో ఉన్న నిల్వ నీటిని ఎప్పటికప్పుడు తొలగించడం చేయాలని సూచిస్తున్నారు. డెంగీ, మలేరియా, డయేరియా వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తలు వివరిస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు దోహదపడుతున్నాయి.
పరీక్షలు చేస్తున్నాం..
జిల్లాలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని వార్డులు, గ్రామాల్లో సమగ్ర ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నాం. అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన వారికి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పరీక్షలు చేసి మందులు ఇస్తున్నాం. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా సీజనల్ వ్యాధులను కొంతవరకు అరికట్టే అవకాశం ఉంది.
– డాక్టర్ ఉమాదేవి, జిల్లా ప్రోగ్రాం అధికారిణి
టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో వైద్య శిబిరాలు
టీబీ, హెచ్‌ఐవీ, హైపటైటిస్ బీ, బీపీ, మధుమేహం పరీక్షలు
జ్వరం, ఇతర వ్యాధులకూ వైద్య పరీక్షలు