బైపాస్ రహదారి ఏది..?
భూపాలపల్లి: నల్ల బంగారం, విద్యుత్ పరిశ్రమతో దినదినం అభివృద్ధి చెందుతూ జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్న భూపాలపల్లికి బైపాస్ రోడ్డు కలగానే మారుతోంది. గత, ప్రస్తుత పాలకులు హామీలు ఇచ్చినా, తమ మేనిఫెస్టోలో పొందుపరిచినా నిర్మాణం మాత్రం జరగడం లేదు. ఫలితంగా జాతీయ రహదారిపై నిత్యం ట్రాఫిక్ సమస్య, ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
నిత్యం ట్రాఫిక్ సమస్య..
సింగరేణి గనులు, కేటీపీపీ పరిశ్రమలు ఉన్న భూపాలపల్లిలో నిత్యం వందల కొద్ది భారీ వాహనాల రాకపోకలు సాగుతుంటాయి. అంతేకాక కాళేశ్వరం వద్ద గోదావరి నది, మానేరు వాగుల నుంచి ఇసుక లారీలు, కాళేశ్వరం వద్ద అంతర్రాష్ట్ర వంతెన మీదుగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి జిల్లా కేంద్రం మీదుగా వేలాది వాహనాలు వెళ్తుంటాయి. ఆయా వాహనాలతో జిల్లా కేంద్రంలో నిత్యం ట్రాఫిక్ సమస్య ఎదురవుతుంది. లారీలను జాతీయ రహదారి పక్కన నిలిపి ఉంచడం, పట్టణం లోపలి నుంచి భారీ వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు సైతం చోటు చేసుకుంటున్నాయి.
ప్రతిపాదనలకే పరిమితం..
2018, 2023లో జరిగిన అసెంబ్లీలో ఎన్నికల్లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు భూపాలపల్లికి బైపాస్ రోడ్డు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికలు జరిగి పార్టీలు అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు బైపాస్ రోడ్డు నిర్మాణంలో పురోగతి లేదు. భూపాలపల్లి పట్టణానికి ఒకవైపు మొత్తం అటవీ ప్రాంతం ఉండటంతో మరోవైపు మోరంచపల్లి గ్రామం నుంచి గుడాడ్‌పల్లి, జంగేడు శివారు ప్రాంతం నుంచి పట్టణంలోని బాంబులగడ్డ అవతల అటవీ ప్రాంతం వరకు సుమారు 20 కిలోమీటర్ల దూరానికి రూ.200కోట్ల నిధులు అవసరం ఉంటాయని ఆర్‌అండ్‌బీ అధికారులు మూడేళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య పునరావృతం అవుతూనే ఉంది.
మాట నిలబెట్టుకుంటా..
ఎన్నికల సమయంలో ఇచ్చి న మాట ప్రకారం తప్పకుండా భూపాలపల్లికి బైపాస్ రోడ్డు మంజూరు చేయిస్తా. సీఎం రేవంత్‌రెడ్డి, నేను ఇటీవలే కేంద్ర మంత్రి నితిన్ గడ్కారిని కలిసి బైపాస్ రోడ్డుకు నిధులు మంజూ రు చేయాలని కోరాం. డీపీఆర్ సిద్ధం చేయాలని కేంద్ర మంత్రి అధికారులను ఆదేశించారు. డీపీఆర్ సిద్ధం కాగానే త్వరలోనే మరోమారు గడ్కారిని కలిసి నిధులు మంజూరు అయ్యేలా చూస్తా.
– గండ్ర సత్యనారాయణరావు,
ఎమ్మెల్యే, భూపాలపల్లి
ఏళ్ల తరబడి ఎదురుచూపు
రోజురోజుకూ పెరుగుతున్న
ట్రాఫిక్ సమస్య
జాతీయ రహదారి పక్కనే
లారీల నిలుపుదల
నిత్యం ప్రమాదాలు
చోటుచేసుకుంటున్న వైనం
బైపాస్ రహదారి ఏది..?


