లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఆహార వ్యాపార నిర్వాహకులకు ఈ నెల 24వ తేదీన లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా గెజిటెట్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ కృష్ణమూర్తి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆహార వ్యాపార నిర్యాహకులు తప్పని సరిగా లైసెన్స్ పొంది ఉండాలన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. లైసెన్స్ గడువు ముగిసిన వారు రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్‌లోని రూం నంబర్ ఎఫ్–19లో సంప్రదించాలన్నారు. వివరాల కోసం జిల్లా ఆహార భద్రత అధికారి 70327 16925, గెజిటెడ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ 99858 20544 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
మొగుళ్లపల్లి: మండలంలోని మెట్టుపల్లికి చెందిన మర్రి శ్రీనివాస్(38) సికింద్రాబాద్ రైల్వేశాఖలో ఎలక్ట్రికల్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. వారం క్రితం విధి నిర్వహణలో ఉండగా పోల్ నుంచి కిందపడిపోయారు. దీంతో సహ ఉద్యోగులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం బ్రెయిన్ డెడ్ అయ్యాడు. వైద్యులు కుటుంబసభ్యులకు అవయవదానంపై అవగాహన కల్పించారు. అవయవాలు ఐదుగురికి అందించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతుడికి భార్య రత్నకుమారి, కూతురు సంహిత, కుమారుడు గీతాన్ ఉన్నారు.
భూపాలపల్లి అర్బన్: ఏరియా సింగరేణి జీఎం కార్యాలయంలోని పర్సనల్ డిపార్ట్‌మెంట్‌లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సంజీవరావు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం పట్ల ఏరియా అధికారులు సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. జీఎం కార్యాలయంలో జీఎం రాజేశ్వర్‌రెడ్డి, అధికారులు మౌనం పాటించారు. 2007లో సింగరేణిలో జరిగిన ఇంటర్నల్ క్లరికల్ పరీక్షల్లో జూనియర్ అసిస్టెంట్‌గా ఎంపికై పలు విభాగాల్లో పనిచేసి సూపరింటెండెంట్‌గా పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందడం తీరనిలోటన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు ఎర్రన్న, రవికుమార్, రాజేశ్వర్, శ్యాంసుందర్, ప్రదీప్, క్రాంతికుమార్, శ్రావణ్‌కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక ఏకపక్షంగా చేశారంటూ 8 మంది వార్డుసభ్యులు సోమవారం ప్రమాణస్వీకారానికి గైర్హాజరయ్యారు. 12 మంది వార్డు సభ్యులకు గాను కేవలం సర్పంచ్ చాట్ల విజయతో పాటు నలుగురు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. గొడవలు చోటుచేసుకోకుండా ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
భూపాలపల్లి అర్బన్: విద్యారంగంలో ఎన్జీవోల జోక్యం ఆందోళనకరంగా మారందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొప్ప సమ్మారావు ఆరోపించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సొమవారం నిర్వహించిన జిల్లా విస్తృత సమావేశానికి సమ్మారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యారంగంలో ఎన్జీవోల పాత్ర గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోందని, పరోక్షంగా ప్రైవేటీకరణకు దారులు వేసే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, ఉపాధ్యాయులను నియమించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని కోరారు. ఈ నెల 28, 29 తేదీల్లో జనగామ జిల్లాలో జరిగే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విద్యా సదస్సు, విస్తృత సమావేశాల వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నక్క తిరుపతి, కొత్త కుమారస్వామి, నాయకులు రాజేందర్, శ్రీధర్, రమేశ్, రఫీపాషా, రమాదేవి, రామయ్య పాల్గొన్నారు.
లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా
లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా


