దత్తాత్రేయ ఆలయంలో మంత్రి పూజలు
కాటారం: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి స్వగ్రామం కాటారం మండలం ధన్వాడలోని శ్రీదత్తాత్రేయ స్వామి ఆలయ తృతీయ వార్షికోత్సం వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పురోహితులు కృష్ణమోహన్‌శర్మ ఆధ్వర్యంలో 32మంది వేద బ్రాహ్మణులు వేదమంత్రోచ్ఛరణల నడుమ పూజా కార్యక్రమాలు కొనసాగించారు. మంత్రి చేతుల మీదుగా పుణ్యాహవాచనము, గణపతి పూజ, 54 కళశములతో పూజ, మూల విరాట్ దత్తాత్రేయ స్వామికి అభిషేకం, పంచామృతాభిషేకం, పుష్పార్చన, దత్తహోమం జరిపించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్‌కుమార్ వార్షికోత్సవ, పూజా కార్యక్రమాల్లో మంత్రి శ్రీధర్‌బాబుతో పాటుగా పాల్గొన్నారు. విప్‌ను మంత్రి శాలువాతో సత్కరించి ఆలయ మెమోంటోను బహుకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంతో పాటు పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వార్షికోత్సవ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఆయన తల్లి జయమ్మ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మంత్రికి వినతుల వెల్లువ..
ధన్వాడకు వచ్చిన మంత్రి శ్రీధర్‌బాబుకు పలువురు ప్రజలు తమ సమస్యలపై వినతులు సమర్పించారు. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని అధిక సంఖ్యలో ప్రజలు మంత్రికి విన్నవించారు. దశల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని మంత్రి సూచించారు. అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో ఇళ్లు ఇవ్వబోమని లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.


