యూరియా ఆన్‌లైన్..
అందుబాటులోకి
ప్రత్యేక యాప్
జిల్లా వివరాలు..
కాటారం: అన్నదాతకు యూరియా కష్టాలు తప్పనున్నాయి. పంట సాగు సమయంలో ఎరువుల కోసం రైతులు ఫర్టిలైజర్ దుకాణాలు, విక్రయ కేంద్రాల ఎదుట సమయం వృథా చేసుకొని నిరీక్షించాల్సిన అవసరం ఇక లేదు. పంటలకు అవసరమయ్యే ఎరువులను ఇంటి వద్ద నుంచే బుక్ చేసుకునే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాసంగి సీజన్ నుంచే ఈ విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. మొదటగా ఫర్టిలైజర్ దుకాణాల నుంచి ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
సాగు విస్తీర్ణంతో సరఫరా..
రైతులు సాగు విస్తీర్ణాన్ని బట్టి ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకొనే అవకాశం కల్పిస్తున్నారు. ఎకరానికి మూడు బస్తాలు ఇచ్చేలా ప్రణాళికలు రూ పొందించారు. వీటిలో ఒక ఎకరం నుంచి రెండు ఎ కరాల్లో సాగుచేసే వారికి రెండు దఫాల్లో ఎరువులను సరఫరా చేయనున్నారు. 5నుంచి 20 ఎకరా ల్లో సాగుచేసే వారికి మూడు దఫాల్లో, 20 ఎకరాల పైన సాగుచేసే వారికి నాలుగు దఫాలుగా ఎరువులు అందించనున్నారు. అవసరం ఉన్న రైతులు విడతల వారీగా యాప్‌లో బుక్ చేసుకున్న తర్వాత సంబంధిత ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడికి లాగిన్ తెలి పిన వెంటనే కావాల్సిన ఎరువులు ఇచ్చేలా ఏర్పా ట్లు చేశారు. ప్లేస్టోర్ ద్వారా ఈ ప్రత్యేక యాప్‌ను రైతులు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
నిల్వ ఎంత ఉందో తెలుసుకోవచ్చు..
ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ఈ యాప్‌తో ఎరువుల నిల్వ ఎక్కడెంత ఉందో ఇట్టే తెలుసుకునే సౌలభ్యం కల్పించారు. రైతులు సమీపంలోని ఇతర షాపుల్లో ఉన్న యూరియా నిల్వలను కూడా తెలు సుకోవచ్చు. రైతులు అవసరమైన యూరియా బస్తాలను తమకు అనుకూలమైన డీలర్ వద్ద ముందే బుక్ చేసుకునే వీలుంటుంది. బుక్ చేసుకున్న తర్వా త నిరీక్షణ లేకుండా యూరియా పొందవచ్చు.
అన్ని వర్గాల రైతులకు వెసులుబాటు..
ఎరువుల బుకింగ్ కోసం తయారుచేసిన ప్రత్యేక యాప్ ద్వారా ప్రతీ రైతుకు యూరియా కష్టాలు తప్పనున్నాయి. కౌలు, పోడు పట్టాలు పొందిన రైతులకు సైతం సేవలు అందేలా సర్కారు యాప్‌ను రూపొందించింది. కౌలు రైతులు భూ యజమాని ఆధార్ ధృవీకరణతో యూరియా బుక్ చేసుకునేలా అవకాశం కల్పించారు. ఇప్పటికే ఈ యాప్‌పై జిల్లాలోని ఫర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులకు అవగాహన కల్పించారు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకు సైతం యాప్ వినియోగం, బుకింగ్ చేసుకునే విధానంపై శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు వివరించారు. ఏఓలు, ఏఈఓలు రైతులకు అవగాహన కల్పించేలా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
యాసంగి సాగు విస్తీర్ణం అంచనా (ఎకరాల్లో..)
వరి 98,000
మొక్కజొన్న 30,000
పెసర 150
ఇతర పంటలు 300
రైతులకు తప్పనున్న కష్టాలు
ఇంటి నుంచే బుక్ చేసుకునే అవకాశం
జిల్లావ్యాప్తంగా 12 మండలాలు ఉండగా 2.27 లక్షల మేర భూమిలో సాగు జరుగుతోంది. 341 ఫర్టిలైజర్ దుకాణాలు ఉండగా.. 1,19,784 మంది రైతులు పంటలు సాగు చేస్తున్నారు. గడిచిన ఖరీఫ్‌లో యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడ్డారు. రోజుల తరబడి ఎరువుల దుకాణాలు, స్టాక్ పాయింట్ల వద్ద క్యూ లైన్లు కట్టి నిరీక్షించారు. యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. దీంతో రైతులకు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడింది. వీటన్నింటినీ అధిగమించేందుకు ప్రభుత్వం ఈ యాప్‌నకు శ్రీకారం చుట్టింది. ఈ యాసంగి సీజన్ నుంచే యాప్ వినియోగాన్ని పూర్తిస్థాయిలో అమల్లోకి తెచ్చేలా ప్రభుత్వం, వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
యూరియా ఆన్‌లైన్..


