కాటారం: మహాముత్తారం మండలం కొర్లకుంట గ్రామపంచాయతీ భవన నిర్మాణంపై శనివారం కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ సభ నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టగా పనుల్లో నాణ్యత లోపించిందని పలు కారణాలతో నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. దీంతో పలువురు మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా గ్రామపంచాయతీ నిర్మాణంపై అభిప్రాయాలు సేకరించాలని సబ్ కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. దీంతో పనులు కొనసాగించడమా లేక మరో చోట నిర్మించడమా అనే అంశాలపై అధికారులు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు. నివేదిక ఆధారంగా త్వరలో చర్యలు చేపట్టనున్నట్లు సబ్‌కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.