కొలువుల కోవెల | - | Sakshi
Sakshi News home page

కొలువుల కోవెల

Nov 14 2026 1:17 AM | Updated on Nov 14 2026 1:17 AM

ఉద్యోగార్థులకు అండగా నిలుస్తున్న గ్రంథాలయాలు

ఏడాది నుంచి ప్రిపరేషన్‌

పుస్తకాల కొరత లేకుండా చూస్తున్నాం

పాత స్థలంలో కొత్త భవనం ఉండాలి

జనగామ: పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు జిల్లా శాఖ గ్రంథాలయం అండగా నిలుస్తోంది. ఐఏఎస్‌, ఐపీఎస్‌, గ్రూప్స్‌ మొదలుకొని పోలీస్‌, రైల్వే, టీచర్‌ తదితర ఉద్యోగ పరీక్షలకు అవసరమైన పుస్తకాలతో పాటు సాహిత్యం, నవలలు, చరిత్ర, పిల్లల కథలు ఇలా అన్ని రకాల పుస్తకాలు కలిపి సుమారు 34 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 14(శనివారం) నుంచి గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సాక్షి పరిశీలనలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

పోటీ పరీక్షలకు పుస్తకాల కొరత లేదు

గ్రంథాలయంలో జాగ్రఫీ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్‌ స్టడీస్‌, ఇండియన్‌ ఎకనామిక్స్‌, రీజనింగ్‌, జువాలజీ, టీఎస్‌పీఎస్సీ, రైల్వే, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, పోలీస్‌ కానిస్టేబుల్‌, సబ్‌ఇన్‌న్‌స్పెక్టర్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌ తదితర అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఖరీదైన ప్రీమియం పుస్తకాలు సైతం అందుబాటులో ఉన్నాయి. అవసరమైన కొత్త పుస్తకాల కొనుగోలుకు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తే మూడు, నాలుగు రోజుల్లోనే పుస్తకాలు తెప్పించే వెసులుబాటు ఉండటంతో విద్యార్థులకు పుస్తకాల కొరత లేకుండా పోయింది.

గ్రంథాలయంలో చదివి..

2024 నుంచి ఇప్పటి వరకు గ్రంథాలయంలో ప్రిపరేషన్‌ చేసిన వారిలో 12 మంది టీచర్లు, 13 మంది కానిస్టేబుళ్లు, ఒక జూనియర్‌ లెక్చరర్‌, గురుకుల లె క్చరర్‌, టీచర్‌, గ్రూప్‌–4, సీహెచ్‌ఎస్‌ఎల్‌, ఎన్టీపీసీ మొత్తం 31మంది ఉద్యోగాలు సాధించడం విశేషం.

సిబ్బంది కొరత.. ఖాళీల భర్తీపై ఆశలు

జిల్లా గ్రంథాలయ శాఖలో గ్రేడ్‌–2 లైబ్రేరియన్‌ పో స్టులు రెండు ఉండగా ఒకరే పనిచేస్తున్నారు. అటెండర్‌, రికార్డు అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన తరిగొప్పుల, చిల్పూరు, జనగామ మండలాలు మినహా మిగతా తొమ్మిది మండలాల్లో మండల గ్రంథాలయాలు ఉన్నాయి. లింగాలఘణపురం మండలంలోని నెల్లుట్ల, కుందారం గ్రామాల్లో గ్రామస్థాయి గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ఇద్దరు రెగ్యులర్‌ లైబ్రేరియన్లు, ఒకరు ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పని చేస్తుండగా మిగతా పోస్టులు ఖాళీగా ఉండగా, స్వీపర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఖాళీలను భర్తీ చేస్తే గ్రంథాలయ సేవలు మరింత విస్తరించే అవకాశం ఉంది.

34వేల పుస్తకాలతో

జిల్లా గ్రంథాలయం..

మండల శాఖల్లో వసతుల లేమి

అద్దె భవనాలు, శిథిలావస్థల్లో కొన్ని..

లైబ్రేరియన్‌ లేక మరికొన్ని..

నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

ఏడాది నుంచి కానిస్టేబుల్‌ ఉద్యోగానికి సిద్ధమవుతున్నా. గ్రంథాలయంలో రోజూ 9 నుంచి 6 గంటల వరకు చదువుతున్నా. డిసెంబర్‌ 20న పరీక్ష ఉండటంతో రన్నింగ్‌, వ్యాయామంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నా.

– గొల్లపల్లి శివకుమార్‌, గోపరాజుపల్లి

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఏ పుస్తకం తక్కువ పడకుండా ప్రయత్నం చేస్తున్నాం. జిల్లా గ్రంథాలయ శాఖ కార్యాలయ నూతన భవనం కోసం 3 సార్లు రాష్ట్ర గ్రంథాలయానికి, సీఎంకు రూ.3కోట్ల ప్రతిపాదనలు పంపించాం. స్టేషన్‌ ఘన్‌పూర్‌ గ్రంథాలయ భవనానికి రూ.2కోట్ల ప్రొసీడింగ్‌ తెచ్చాం. పనులు ప్రారంభమవుతుంది. రఘునాథపల్లి భవనం కోసం రూ.30లక్షల మంజూరు ఎస్టిమేషన్లకు పంపించాం. ప్రతీ గ్రంథాలయానికి రూ.లక్ష మైనర్‌ రిపేరుకు పంపించాం. అనుమతులు రాగానే పనులు మొదలవుతాయి. జఫర్‌గఢ్‌ నూతన బిల్డింగ్‌కు ప్రపోజల్‌ పంపించాం. చిల్పూరు నూతన గ్రంథాలయ భవనానికి తీర్మానం చేశాం.

– మారడోజు రాంబాబు, చైర్మన్‌, జిల్లా గ్రంథాలయ శాఖ

మూడేళ్లుగా ఎస్‌ఎస్‌సీ, రైల్వే పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నా. ప్రస్తుతం ఇబ్బందుల్లేవు. గ్రంథాలయాన్ని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో నూతన భవనంలో ఏర్పాటు చేస్తే మరింత సౌకర్యంగా ఉంటుంది.

– నోముల తరుణ్‌, జనగామ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement