జనగామ రూరల్: దక్షిణ భారతదేశంలో అఖండ జ్యోతి నిర్వహిస్తున్న మూడో దేవస్థానంగా పేరుపొందిన జిల్లాలోని పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 24వ తేదీ మంగళవారం ధాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ, అఖండ జ్యోతి దర్శనం, లక్షదీపోత్సవం, తదితర ఆధ్యాత్మిక కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అఖండ జ్యోతి దర్శనం, లక్షదీపోత్సవానికి సంబంధించిన ప్రచార వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ నెల 24న నిర్వహించే అఖండ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని స్వామి దుర్గానందపురి మహారాజ్ (మాజీ అన్నపూర్ణేశ్వరి కాశీ విశ్వనాథ పీఠం పీఠాధిపతి) చేతుల మీదుగా చేపట్టనున్నారు. కార్యక్రమంలో దేవాలయ ఈఓ లక్ష్మీ ప్రసన్న, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.
భూ రీసర్వే పరిశీలన
కొడకండ్ల: మండలంలోని రంగాపురం గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీసర్వేను శుక్రవారం అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్ పరిశీలించారు. గ్రామంలో నిర్వహిస్తున్న భూ రీసర్వే వివరాలను ఆయన తెలుసుకొని తగు సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఏడీ మన్యంకొండ, డీఐ శ్యాంప్రసాద్, తహసీల్దార్ అనీల్‌బాబు, టీంలీడర్ సుమన్, సర్వేయర్ జోసఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు పంచాయతీ
కార్యదర్శుల సస్పెన్షన్
రఘునాథపల్లి: మండలంలోని ఖిలాషాపూర్, జాఫర్‌గూడెం పంచాయతీ కార్యదర్శులు ఇల్లెందుల సురేందర్‌బాబు, బండ మధును సస్పెండ్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఖిలాషాపూర్, జాఫర్‌గూడెం గ్రామాల్లో ఎంపీడీఓ శ్రీనివాసన్‌కావ్య ఆకస్మిక తనిఖీ నిర్వహించి పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అయా గ్రామాల్లో వసూలైన ఇంటి, నల్లా పన్నులకు సంబంఽధించిన డబ్బులు ఏకకాలంలో ఎస్టీఓలో జమ చేయలేదని తేలింది. దీంతో ఇద్దరు పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై ఎంపీడీఓ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు కలెక్టర్ ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
హామర్ త్రో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
జనగామ రూరల్: మండలంలోని పీఎం శ్రీ ధర్మకంచ పాఠశాల విద్యార్థి వల్లెపు చామంతి హామర్‌త్రో క్రీడలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని ప్రధానోపాధ్యాయుడు కనకయ్య శుక్రవారం తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థిని చామంతిని అభినందిస్తూ శాలువాతో సన్మానం చేశారు. ఉపాధ్యాయులు భూపతి, కరుణ, అనిత,శ్రీనివాసులు, చంద్రశేఖర్ రావు , లక్ష్మీ తహెరా మసూద్ ,లింగం నిర్మల విజయకుమార్, ఉమాదేవి, లలిత, సతీష్ ,మహేందర్ మంగ అభినందనలు తెలిపారు.
జాతీయస్థాయి నాటిక
పోటీలకు డాక్టర్ ఆసిఫా
రఘునాథపల్లి: మండల పశువైద్యాధికారి డాక్టర్ అసిఫా జాతీయస్థాయి నాటిక పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఆలిండియా సివిల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఆమె బతుకు బొమ్మలాట నాటిక ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు శుక్రవారం సమాచారం అందింది. 2027 జనవరిలో ఢిల్లీలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో డాక్టర్ ఆసిఫా పాల్గొననున్నారు. ఈ సందర్బంగా తోటి సిబ్బంది ఆమెను అభినందించి, జాతీయ స్థాయిలోనూ ప్రతిభ చాటాలని ఆకాంక్షించారు.


