ఖద్దరు వెనక కష్టాలు | - | Sakshi
Sakshi News home page

ఖద్దరు వెనక కష్టాలు

Nov 7 2026 1:12 AM | Updated on Nov 7 2026 1:12 AM

గెలిచినా తప్పని తిప్పలు

అప్పుల ఊబిలోకి ద్వితీయ శ్రేణి నాయకులు

బయటకు తెల్లని ఖద్దరు దుస్తులు..వెంట అనుచరులు..ఖరీదైన కార్లలో హుందాగా కనిపించే నాయకుల జీవితాల్లోనూ ఎన్నో ఆర్థిక కష్టాలు దాగి ఉన్నాయి. రాజకీయ హోదా నిలబెట్టుకోవాలనే తాపత్రయం, రియల్‌ ఎస్టేట్‌ మందగమనం, ఆదాయం లేని పరిస్థితులు వారిని అప్పుల ఊబిలోకి నెడుతున్నాయి. పరువు పోతుందనే భయంతో ఆర్భాటాన్ని తగ్గించుకోలేక, వడ్డీలు కట్టలేక సతమతమవుతున్న గ్రామ, మండల, జిల్లా స్థాయి నాయకులు, నేతల వ్యథలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. – జనగామ

జిల్లాలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. రాజకీయంగా చక్రం తిప్పాలని, పార్టీల్లో గుర్తింపు తెచ్చుకోవాలని, ప్రజల్లో హుందాగా కనిపించాలని ఖద్దరు దుస్తులు ధరించి రో డ్లపై తిరిగే నాయకుల జీవితాల్లో ఆర్థిక కష్టాలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు రాజకీయ హోదాకు, పలుకుబడికి ప్రతీకగా కనిపించిన ఖద్దరు చొక్కా, తెల్లప్యాంటు, పంచెల వెనుక ఇప్పుడు అప్పులు, వడ్డీలు, ఆర్థిక ఒత్తిళ్లు దాగి ఉన్నాయి.

హోదా కోసం అదనపు ఖర్చులు

ప్రజాప్రతినిధి నుంచి సామాన్య పార్టీ నాయకుడి వరకు రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగా ఖద్దరు దుస్తులు, ఖరీదైన కార్లు, వెంట నలుగురు అనుచరులు ఉండేలా చూసుకుంటున్నారు. హోదా పెంచుకునేందుకు ఈఎంఐలపై కార్లు కొనుగోలు చేస్తూ, అనుచరుల నిర్వహణ, పార్టీ కార్యక్రమాలు, ఇతర ఖర్చుల కోసం జేబులు ఖాళీ చేసుకుంటున్నా రు. దీంతో ఆదాయానికి మించి వ్యయాలు పెరిగి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

పడిపోయిన రియల్‌ ఎస్టేట్‌.. ఆదాయానికి గండి

గతంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని నమ్ముకున్న పలువురు నాయకులు నెలకు రెండు మూడు ప్లాట్లు లేదా వ్యవసాయ భూములు విక్రయిస్తూ రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు సంపాదించేవారు. అయితే గత రెండేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ రంగం మందగించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నెలల తరబడి ప్లాట్లు, భూములు విక్రయాలు లేక ఆదాయం నిలిచిపోయింది. అమ్మకానికి సిద్ధంగా ఉన్నా ఆశించిన ధర రాకపోవడం, తక్కువ ధరకు విక్రయించేందుకు మనసు ఒప్పుకోకపోవడంతో చేతిలో నగదు లేకుండా పోతోంది. ఒకప్పుడు ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు సైతం ఇప్పుడు ఖర్చులకు ఇబ్బందులు పడుతున్నారు.

పరువు కోసం అప్పులు..

ఎన్నికల సమయంలో చేసిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండగా, అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిళ్లు అధికమవుతున్నాయి. ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలో తెలియక కొందరు ప్లాట్లు అమ్ముకుంటుండగా, మరికొందరు ఇళ్లను కుదువపెడుతున్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టడం, అవసరమైతే విక్రయించడం వంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇటీవల జిల్లాలో ఇద్దరు తెలంగాణ ఉద్యమకారులు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిళ్లతో బలవన్మరణాలకు పాల్పడిన ఘటనలు నాయకత్వ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగించాయి.

హోదా తగ్గుతుందనే భయం

రాజకీయంగా ఎదిగిన తర్వాత ఒక్కసారిగా ఖర్చులు తగ్గించుకుంటే సమాజంలో తమ విలువ తగ్గుతుందేమోననే భయం పలువురిని వెంటాడుతోంది. నిన్నటి వరకు అబ్బో.. మస్తు నాయకుడు అనిపించుకున్న తాము, నేడు అయ్యో.. ఏమైందనే మా టలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని మదనపడుతున్నారు. ఆదాయం లేకపోయినా హోదాను కాపాడుకోవడానికి అప్పులు చేస్తూనే ఉన్నారు. ప్రజా సేవ, రాజకీయ గుర్తింపు, వ్యక్తిగత పరువు మధ్య నలిగిపోతూ వడ్డీలు కడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. బయటకు ఖద్దరు దుస్తుల్లో హుందాగా కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం అప్పుల భారంతో సతమతమవుతున్నారు. చూడటానికి తెల్లగా మెరిసే ఖద్దరు వెనుక ఇన్ని ఆర్థిక కష్టాలు ఉంటాయని ఊహి ంచలేని పరిస్థితి నెలకొంది.

గతంలో జరిగిన మున్సిపల్‌, సర్పంచ్‌, వార్డు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారు. కొందరు గెలవగా, మరి కొందరు ఓటమి పాలయ్యారు. ఓడిన అభ్యర్థులు రాజకీయ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నప్పటికీ, గెలిచిన ప్రజాప్రతినిధులకు మాత్రం రోజు వారీ నిర్వహణ ఖర్చులు తప్పడం లేదు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డు సభ్యులు, మున్సిపల్‌ కౌన్సిలర్లు తమ హోదాకు తగ్గట్టుగా వ్యవహరించాల్సి వస్తోంది. పార్టీ ముఖ్య నాయకుల పర్యటనలు, ప్రభుత్వ కార్యక్రమాలు, ఇతర సమావేశాలకు సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. మరోవైపు కాంట్రాక్టు పనులు చేపట్టే అవకాశాలు తగ్గడం, చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో జాప్యం కావడంతో ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతోంది.

హోదా కోసం ఆరాటం..

ఆర్థికంగా తిప్పలు

రియల్‌ ఎస్టేట్‌ ఢమాల్‌

ఆదాయం ఆగినా ఆర్భాటం తగ్గలేదు

ఎన్నికల అప్పులకు పెరుగుతున్న వడ్డీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement