హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ) మహాజన సభ రసాభసాగా సాగింది. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జ్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధ్యక్షతన మహాజన సభ నిర్వహించారు. మహాసభ ఎజెండా అంశాన్ని, నివేదికను ఏజీఎం అశోక్ ప్రవేశ పెట్టారు. అనంతరం తొర్రూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కక్కిరాల హరిప్రసాద్ మాట్లాడుతూ.. పీఏసీఎస్ చైర్మన్ల కాలపరిమితి ముగిసినందున ఎన్నికలు నిర్వహించేందుకు తీర్మానం చేయాలని కోరారు. దీంతో నామినేటెడ్ అయిన కొత్త చైర్మన్లు అభ్యంతరం వ్యక్తం చేశా రు. ఈ క్రమంలో పాత, కొత్త చైర్మన్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా సభ రసాభాసగా మారడంతో డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ సభ్యుడు, హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్.రవి కలుగజేసుకున్నారు. ఈ అంశం కోర్టు విచారణలో ఉన్నందున మాట్లాడడం సమంజసం కాదని చెప్పారు. అనంతరం చర్చ సాగింది. అంతకు ముందు పాత చైర్మన్లు కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌కి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. పలువురు సొసైటీల చైర్మన్లు మాట్లాడుతూ.. ఎరువుల రవాణా చార్జీలు సహకార సంఘాలు చెల్లించాల్సి రావడం భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రూ.10.23 కోట్ల లాభంతో వరంగల్ డీసీసీబీ..
మహాజన సభకు అధ్యక్షత వహించిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సభ ప్రారంభించి మాట్లాడుతూ.. వరంగల్ డీసీసీబీ టర్నోవర్ రూ.2,663.73 కోట్లకు చేరుకుందన్నారు. డిపాజిట్లు రూ.700.90 కోట్లు, అప్పులు రూ.1,962.83 కోట్లుగా ఉందని వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.10.23 కోట్ల లాభం సాధించి అభివృద్ధి పథంలో ఉందన్నారు. లాభాలు వచ్చిన క్రమంలో సభ్య సహకార సంఘాలకు రూ.1.53 కోట్ల డివిడెండ్‌ను ప్రకటించారు. ప్రతీ సొసైటీకి కొత్త పంట రుణాలకు రూ.10లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు చెప్పారు. 50 శాతం రికవరీ సాధించిన సంఘాలకు రూ.50 లక్షలు, ఏ,బీ, కేటగిరి ఆడిట్ ర్యాంకింగ్ సాధించిన సొసైటీలకు రూ.30 లక్షల చొప్పున దీర్ఘకాలిక రుణాల సహాయం అందించనున్నట్లు వివరించారు. రుణ బకాయిదారులకు ఉపశమనం కల్పించేందుకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ పథకాన్ని 2027, మార్చి 31వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు శాఖల విస్తరణలో భాగంగా భూపాలపల్లి, ములుగు, ఘన్‌పూర్ శాఖల భవన నిర్మాణాలకు స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయినట్లు వివరించారు. చివరగా గూడూరు బ్రాంచ్ ఖాతాదారుడు కంచె సునీల్ ప్రమాద మరణ బీమా క్లెయిమ్ కింద రూ.2లక్షల పరిహార చెక్కును కలెక్టర్ బాధిత కుటుంబానికి అందజేశారు. మహాజన సభలో డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎం ఉషశ్రీ, ఓఎస్‌డీ వెంకటేశ్వర్లు, హనుమకొండ జిల్లా సహకార అధికారి (డీసీఓ), పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీ సభ్యుడు బి.మోహన్, నాబార్డు డీడీ ఎం చంద్రశేఖర్, ఆయా జిల్లాల డీసీఓలు నీరజ, వాల్యానాయక్, సర్దార్ సింగ్, వ్యవసాయ, ఉద్యా న, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.
పీఏసీఎస్ పాత, కొత్త చైర్ పర్సన్ల మధ్య వాగ్వాదం
ఎన్నికలు నిర్వహించాలని
కోరిన పాత చైర్మన్లు
అభ్యంతరం వ్యక్తం చేసిన
నామినేటెడ్ చైర్మన్లు
కలుగజేసుకున్న
అదనపు కలెక్టర్ ఎన్.రవి


