● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ రూరల్: విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపైనా ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతీ విద్యార్థి ఏదో ఒక క్రీడలో నైపుణ్యం సాధించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియంలో కలెక్టర్ పీఎంశ్రీ పాఠశాలలు ,ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు క్రీడాపోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో విద్యా శాఖ ఏడీ శ్రీనివాస్, ఎస్జీఎఫ్ కార్యదర్శి గోర్ సింగ్, సీఎంఓ యాదగిరి,విద్యార్థులు పాల్గొన్నారు.
క్రీడా పరికరాల పరిశీలన
క్రీడాకారులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, క్రీడా పరికరాలను సరైన విధంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని ధర్మకంచ మినీ స్టేడియాన్ని కలెక్టర్ సందర్శించి అందుబాటులో ఉన్న క్రీడా సౌకర్యాలు, పరికరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
‘స్వేచ్ఛా రథం’ ప్రారంభం
వెట్టిచాకిరీ నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. కలెక్టరేట్ ఆవరణలో వెట్టిచాకిరీపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా రూపొందించిన ‘స్వేచ్ఛా రథం’ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వెట్టిచాకిరీపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, బాండెడ్ లేబర్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 080–69434343 గురించి ప్రచారం చేయడం ఈ కార్యక్రమం ప్రధా న ఉద్దేశమని పేర్కొన్నారు. కార్మిక శాఖ అధికారి కుమారస్వామి, డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ, స్కోప్ ఎన్జీఓ జీ. మనోజ్ కుమార్ పాల్గొన్నారు.
పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలి
బచ్చన్నపేట : పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల కరస్పాండెంట్ నారమల్ల గీత, ఉపాధ్యాయులు, అధికారులు ఉన్నారు.


