రైళ్లపై ‘అర్నబ్‌’ ఎఫెక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

రైళ్లపై ‘అర్నబ్‌’ ఎఫెక్ట్‌

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

కాజీపేట రూరల్‌ : వరంగల్‌, కాజీపేట మీదుగా ప్రయాణించే పలు రైళ్లపై అర్నాబ్‌ తుపాను ఎఫెక్ట్‌ పడింది. దీంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని రైల్వే అధికారులు మంగళవారం తెలిపారు. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్‌ అలర్ట్‌ జారీ చేయగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నద్ధమైందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రా, ఒడిశా సహా పలు ప్రాంతాలపై దీని ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికుల భద్రత రైలు నిర్వహణ దృష్ట్యా పరిస్థితులకు అనుగుణంగా ఈ ప్రాంతంలో రైళ్ల నడిపే సరళిలో మార్పులు చేసే అవకాశం ఉందని అన్నారు. నేడు అతి తీవ్రమైన తుపానుగా బాపట్ల, విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు. మహబూబాబాద్‌ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసినట్లు వెల్లడించారు. అక్టోబర్‌ 28, 29వ తేదీల్లో వరంగల్‌, హనుమకొండ, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పలు మార్గాల్లో, సెక్షన్లలో ప్రయాణించే అనేక రైళ్లను రద్దు చేయడం లేదా దారి మళ్లించడం ఉంటుందని పేర్కొన్నారు.

అధికారులతో భద్రతా చర్యలపై సమీక్ష

దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌కుమార్‌ శ్రీవాస్తవ సికింద్రాబాద్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ డాక్టర్‌ ఆర్‌.గోపాలకృష్ణన్‌, ఇతర అధికారులతో భద్రతా చర్యలు, ముందస్తు సన్నద్ధతపై సమీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. డివిజన్‌ పరిధిలో గుర్తించిన ప్రమాదకర ప్రాంతాలు, వంతెనలను, ఆయా ప్రదేశాల్లో చేపడుతున్న గస్తీ ఏర్పాట్లు, పెట్రోల్‌మెన్‌, వాచ్‌మెన్‌ల నియామకాన్ని, చెరువు నీటి మట్టాల స్థితిని కూడా సమీక్షించినట్లు తెలిపారు. కాజీపేట, డోర్నకల్‌ వద్ద బండరాళ్లు, ఇసుక సంచులు, కంకర రేక్‌లతో పాటు ప్రమాద సహాయక రైళ్లు, వైద్య పరికరాల సంసిద్ధత, వాటి మోహరింపులు, సిబ్బంది రైల్వే ఆస్తుల భద్రతను నిర్ధారించడానికి అన్ని విభాగాల అధికారులు పర్యవేక్షిస్తున్నట్లు వివరించారు.

ప్రయాణికులు అలర్ట్‌

రైలు ప్రయాణికులు భారీ వర్షాలు, తుపాను పరిస్థితుల దృష్ట్యా తమ ప్రయాణాలను ప్లాన్‌ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రైళ్ల రద్దు, దారి మళ్లింపు, పునఃప్రణాళిక రైలు సేవల విధానంలో మార్పులకు సంబంధించిన సమాచారాన్ని రిజర్వు, టిక్కెట్లను బుక్‌ చేసుకునే సమయంలో ఇచ్చిన ప్రయాణికుల మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా తెలుపడం జరుగుతుందన్నారు. అధికారిక రైల్వే అప్లికేషన్స్‌, వెబ్‌సైట్‌ల ద్వారా రైళ్ల పరిస్థితిని చూసుకోవచ్చని లేదా 139 విచారణ నంబర్‌కు డయల్‌ చేయవచ్చని, రైళ్ల రద్దు, పాక్షిక రద్దు, దారి మళ్లింపు సమాచారాన్ని ఫేస్‌బుక్‌ (సౌత్‌ సెంట్రల్‌ రైల్వే) ఇన్‌స్టాగ్రామ్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

నేడు, రేపు ఉమ్మడి జిల్లాలో రెడ్‌ అలర్ట్‌

కాజీపేట, డోర్నకల్‌లో బండరాళ్లు, ఇసుక సంచులు,ప్రమాద సహాయక రైళ్లు

అధికారులతో రైల్వే జీఎం సమీక్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement