జఫర్‌గఢ్: మండల కేంద్రంలోని వేల్పుగొండ కొండపై వెలిసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి పుష్కర బ్రహ్మోత్సవాలు ఈనెల 30 నుంచి వైభవంగా జరగనున్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీలక్ష్మీనర్సింహ సీతారామచంధ్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఏటా నిర్వహించే స్వామివారి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఈసందర్భంగా ఆలయ అర్చకుడు పొడిశేట్టి వెంకటాచార్యులు మాట్లాడుతూ.. 30వ తేదీ నుంచి 2వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు తెలిపారు. 30న సాయంత్రం 5 గంటల నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయన్నారు. 31న సుదర్శన హోమం, పూర్ణాహుతి, అరగింపు, తీర్థగోష్టి 1న లక్ష్మీనర్సింహస్వామి కల్యాణమహోత్స వం, 2న స్వామివారి చక్రస్నానం, పల్లకిసేవ, సా యంత్రం సమయంలో పుష్పయాగం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భక్తులు, గ్రామస్తులు భారీగా పా ల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
గ్రామాల్లో కేంద్ర బృందం పరిశీలన
నర్మెట: జాతీయ పంచాయతీ అవార్డుల పరిశీలనలో భాగంగా బ్లాక్ పంచాయతీ ఎంపికకు మండల కేంద్రంతో పాటు ఆగాపేట, ఇప్పలగడ్డ గ్రామాలను కేంద్ర బృందం సభ్యుడు అభిషేక్ రాజ్‌బార్ మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా గ్రామంలో నిర్మించిన ఫాంపాండ్, కమ్యూనిటీ సోక్ పిట్‌లను పరిశీలించారు. భూగర్భ జలాల పెంపునకు తీసుకుంటున్న చర్యలు, అభివృద్ధి పనులు, పర్యావరణ పరిరక్షణ చర్యలు, వనరుల సంరక్షణ, ప్రజల భాగస్వామ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి పనులపై అధికారులను, సర్పంచ్ పగిడిపాటి రాజు, ధరావత్ రాజమణిని వివరాలు అడిగి తెసుకున్నారు. జెడ్పీ సీఈఓ బలరాం, అడిషనల్ డీఆర్డీఓ, డిప్యూటీ సీఈఓ నాగ శేషాద్రి సూరి, ఎంపీడీఓ చిదురాల సుమన్, ఏపీఓ బిరుకూరి రమాదేవి, ఉప సర్పంచ్ అనిల్ కుమార్, కార్యదర్శి పూల శ్రీకాంత్ గ్రామస్తులు ఉన్నారు.
రూ.12.12 లక్షల విలువైన బాణసంచా పట్టివేత
స్టేషన్‌ఘన్‌పూర్: మున్సిపాలిటీ పరిధిలోని శివునిపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేశారనే విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్, ఘన్‌పూర్ పోలీసులు దాడులు నిర్వహించి రూ.12,12,830 విలువైన బాణసంచా స్వాధీనం చేసుకున్నారు. తగిన రక్షణ చర్యలు పాటించకుండా నిల్వ చేసిన శివునిపల్లిలో బెలిదె సంతోష్ షాపులో రూ.4,08,000, పార్శి యశ్వంత్ షాపులో రూ.5,29,830, ఘన్‌పూర్ ఎస్సీ కాలనీలోని ఆకుల గోపాల్‌షాపులో రూ.2,75,000 విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ ఎస్.శ్రీనివాస్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా నిల్వ చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.


