నోటీస్‌బోర్డ్‌ | - | Sakshi
Sakshi News home page

నోటీస్‌బోర్డ్‌

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

ఎంజీఎంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకానికి ప్రకటన

కాశిబుగ్గ : వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకానికి మంగళవారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 16 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టులను వివిధ విభాగాల్లో నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ నియామకాలు పూర్తిగా తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్టు పద్ధతిలో ఉంటాయని పేర్కొన్నారు. నియామకం తేదీ నుంచి 2027 మార్చి 31వరకు లేదా అవసరం ముగిసే వరకు వీటిలో ఏది ముందు అయితే అప్పటి వరకు మాత్రమే పోస్టులో కొనసాగుతారని తెలిపారు. ఆర్థోపిడిక్‌లో 4, పిడియాట్రిక్‌–1, ఎమర్జెన్సీ మెడిసిన్‌–7, రేడియాలజీ– 2, కార్డియాలజీ–1, న్యూరో సర్జరీ–1 చొప్పున పోస్టులు భర్తీ చేస్తారని ఆయన వివరించారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్‌ 2న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరై తమ డాక్యుమెంట్లను సమర్పించాలని, దరఖాస్తు ఫారాలు ఎంజీఎం ఆస్పత్రి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. తుది జాబితా ఆస్పత్రి వెబ్‌సైట్‌లో, ఆస్పత్రి నోటీసు బోర్డులో ప్రచురిస్తామని పేర్కొన్నారు.

ఆయుష్‌లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలకు..

వరంగల్‌ జిల్లా ఆయుష్‌ శాఖలో జాతీయ ఆయుష్‌ మిషన్‌ పథకం కింద ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న 12 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నియామకాల్లో భాగంగా ఆయుష్‌ డాక్టర్‌ విత్‌ పీజీ క్యాలిఫికేషన్‌తో ఒక పోస్టు, ఆయుష్‌ మెడికల్‌ ఆఫీసర్‌ 4 పోస్టులు, డైటీషన్‌ ఒక పోస్టు, సైకోసోషల్‌ కౌన్సిలర్‌ ఒక పోస్టు, యోగా ప్రొఫెషనల్‌ ఒక పోస్టు, మల్టీ పర్పస్‌ వర్కర్‌ (ఎంపీడబ్ల్యూ) 4 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వివరించారు. ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 27 నుంచి 31 వరకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి వరంగల్‌ కార్యాలయంలో ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారన్నారు.

మక్కలకు రికార్డు ధర క్వింటాకు రూ.3085

● పత్తి రూ. 9,070లు

ఖిలా వరంగల్‌ : వరంగల్‌ ఏనుమాముల మార్కెట్‌లో మంగళవారం మొక్కజొన్నకు రికార్డు ధర పలికింది. క్వింటాకు గరిష్టంగా రూ.3,021 నుంచి రూ.3,085 ధర రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మక్కలకు ప్రభుత్వం మద్దతు ధర రూ.2,410 ఉండగా, వ్యాపారుల మధ్య పోటీతో అధిక ధర లభించింది. పత్తికి ప్రభుత్వం మద్దతు ధర రూ.8,667లు ఉండగా.. క్వింటాకు రూ.9,070 ధర పలికింది. పల్లికాయ ప్రభుత్వ మద్దతు ధర రూ.8,800లు ఉండగా.. మార్కెట్‌లో పల్లిధర పతనమైంది. క్వింటాకు రూ.6,952ల ధర పలికింది. మినుములకు మద్దతు ధర రూ.7,800ల ధర ఉండగా.. రూ.5,563ల ధర పలికినట్లు మార్కెట్‌ కార్యదర్శి శ్రీనివాస్‌ తెలిపారు. కాగా మహబూబాబాద్‌కు చెందిన రైతు గుగులోత్‌ లాలు నాయక్‌ క్వింటా పసుపు విక్రయానికి తీసుకొచ్చారు. మార్కెట్‌ సూపర్‌వైజర్‌ సాగర్‌ నేతృత్వంలో నిర్వహించిన జెండా పాటలో వ్యాపారులు పోటీపడటంతో క్వింటాకు రూ.19,089ల ధర లభించింది.

కొత్త నోములకు అవకాశం

● జాగర్లపూడి శ్రీనివాస్‌ శర్మ

కాజీపేట : ఈ ఏడాది కేదారేశ్వర వ్రతం.. కొత్త నోములు చేసుకోవడానికి అవకాశం ఉందని అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రధాన అర్చకుడు జాగర్లపూడి శ్రీనివాస్‌ శర్మ తెలి పారు. కాజీపేట 63వ డివిజన్‌ జూబ్లీ మార్కెట్‌ ఆవరణలోని దక్షిణ ముఖ ఆంజన్న ఆలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. నవంబర్‌ 8వ తేదీ (ఆదివారం) ఉదయం 11 గంటల నుంచి సోమవారం ఉదయం 7:30 గంటల వరకు స్వాతి నక్షత్రం ఉంటుందని, అమావాస్య ఉదయం 11 గంటల నుంచి తెల్లవారి 11:30 గంటల వరకు వర్తిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం మంగళ హారతులు, దీపావళి ధనలక్ష్మి పూజలు చేసుకోవాలన్నారు. ఆదివారం కేదారేశ్వర వ్రతం ఆచరించి సోమవారం దేవుడిని ఎత్తుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది కేదారేశ్వర స్వామి నోములు, పడిపోయిన నోములు నిర్వహించుకోవచ్చని ఆయన సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement