జనగామ: సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబురాలు జిల్లాకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ ఆడిపాడారు. ఎమ్మెల్యే సతీమణి నీలిమ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడగా, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అడవి పూలతో అందంగా బతుకమ్మలను తయారు చేసి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు.


