జనగామ రూరల్: సంప్రదాయ ఇంధన వనరుల వినియోగాన్ని తగ్గించి సోలార్ విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద గృహ వినియోగదారులు రూఫ్‌టాప్ (ఇంటి పైకప్పుపై) సోలార్ ఏర్పాటు చేసుకునేందుకు భారీ రాయితీ అందిస్తోంది. పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా జిల్లాలో సేవా సేతు కార్యక్రమం కింద టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ జెన్‌కో ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోలార్ ఏర్పాటుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గ్రామాల్లో సోలార్ వాడకంపై అధికారులకు దిశ నిర్దేశం చేశారు. జిల్లాలో అన్నదాతలు సోలార్ ప్లాంట్‌కు ముందుకు రాగా 57 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఏడుగురు 2 మెగావాట్లు చొప్పున ఏర్పాటు చేసుకున్నారు.
ప్రత్యామ్నాయ మార్గంగా సోలార్ సిస్టం
ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో విద్యుత్ పొదుపు ఎంతైనా అవసరం. ఇటీవల రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ మిట్టల్ కలెక్టర్ల సమావేశంలో వివరిస్తూ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి వరకు దేశవ్యాప్తంగా విద్యుత్ లభ్యత గణనీయంగా తగ్గుతోందని పగటిపూట విద్యుత్ అవసరాలను తీర్చగలుగు తున్నప్పటికీ రాత్రి పీక్ అవర్స్‌లో కొంత కొరత ఉంటోందని తెలిపారు. 3,000 మెగావాట్ల బ్యాటరీ నిల్వతో కూడిన సౌర విద్యుత్ ప్రాజెక్టు, 2,000 మెగావాట్ల రౌండ్–ది–క్లాక్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టు, 800 మెగావాట్ల బ్యాటరీ నిల్వ ప్రాజెక్టు సహా నాలుగు ప్రధాన ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే గ్రామాల్లో రైతులు సోలార్ ఉత్పత్తులపై దృష్టి సారించాలని విద్యుత్ సమస్యను అధిగమించడానికి సోలార్ ఉపయోగపడుతుందని ముఖ్యంగా ఇంటి అవసరాలకు, వ్యవసాయ బావుల వద్ద ఏర్పాటుకు ముందుకు రావాలన్నారు. విద్యుత్ సమస్యలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను ఉపయోగించుకోవాలని తెలిపారు.
సోలార్ విద్యుత్ ప్రయోజనాలివే..
రైతులు, గృహవినియోగదారులు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను సోలార్ ద్వారా పొందవచ్చు. బిల్లులు ఆదా చేసుకోవడంతోపాటు మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తే నెట్ మీటరింగ్ ద్వారా డిస్కం నుంచి అదనపు ఆదాయం వస్తుంది. గతంలో సబ్సిడీ పొందకుండా అనువైన రూఫ్‌టాప్ ఉన్నవారు అర్హులు. కిలోవాట్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యూనిట్‌కు రూ.30,000 రెండు కిలోవాట్లకు రూ.60,000, మూడు కిలోవాట్‌లు అంతకంటే ఎక్కువగా అయితే రూ.78,000 సబ్సిడీ చెల్లిస్తారు. ఈ మొత్తం నేరుగా వినియోగదారుడి బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. బ్యాంక్ సబ్సిడీ కింద 80 నుంచి 85 శాతం రుణాలు అందేలా ప్రభుత్వం సహాయం అందిస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కిలోవాట్స్‌కు రూ.18,000 చొప్పున సీహెచ్‌ఎస్, ఆర్‌డబ్ల్యూఏ (సాధారణ సామర్థ్యాలు, ఈవీ చార్జింగ్) కోసం 500 కిలోవాట్ వరకు సబ్సిడీ అందుబాటులో ఉంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వినియోగదారులు ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, కరెంట్ బిల్లుతో సమీపంలోని విద్యుత్ కార్యాలయంలో సంప్రదించాలి.
‘పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ’తో
సొంతంగా విద్యుత్ ఉత్పత్తి
ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానల్స్
ఏర్పాటుకు అవకాశం
కిలోవాట్ల ప్రకారం సబ్సిడీ
గృహ వినియోగదారులకు అవగాహన
పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోగా అవసరాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించడంతో పాటు సోలార్ సిస్టంను అందుబాటులోకి తీసుకోని రావాలి. జిల్లాలో సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటుకు గాను 57 దరఖాస్తులు రాగా ఏడుగురు ఏర్పాటు చేసుకున్నారు. రూఫ్‌టాప్ సోలార్ ప్రస్తుత టారిఫ్ ప్రకారం కిలోవాటు రూ.436, రెండు కిలోవాట్లకు రూ.1,328, మూడు కిలోవాట్లకు రూ.2,330 ఆదా అవుతుంది. తద్వారా పెట్టుబడి తిరిగి పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
–సంపత్‌కుమార్, ఎస్‌ఈ, ఎన్పీడీసీఎల్


