సోమవారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
జనగామ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు ఆదివారం జిల్లాలో అంబరాన్నంటాయి. ప్రకృతిలో లభించే తీరొక్క అడవి పూలతో బతుకమ్మలను పేర్చి, గౌరమ్మను ఆరాధిస్తూ మహిళలు నిర్వహించిన వేడుకలు జిల్లా కేంద్రంలో పండుగ శోభను నింపాయి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో పట్టణంలోని బతుకమ్మకుంటలో వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా ప్రకృతిని ఆరాధించే సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన బతుకమ్మలకు మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్ ప్రత్యేక బహుమతులు అందజేశారు.
రంగప్ప చెరువు వద్ద, కాలనీల్లో..
జిల్లా కేంద్రంలోని రంగప్ప చెరువు వద్ద కూడా సద్దుల బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున జరిగాయి. పట్టణంలోని పాతబీటు బజారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ పరిసరాలు, బాలాజీనగర్, కురుమవాడ, గీతా నగర్, బాణాపురం, గిర్నిగడ్డ, గుండ్లగడ్డ, ధర్మకాంచ, అంబేద్కర్ నగర్, శ్రీ విల్లాస్ కాలనీ తదితర ప్రాంతాల్లోనూ మహిళలు సామూహికంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.
అంబరాన్నంటిన సద్దుల సంబురం
గౌరమ్మకు ఆడపడచుల నీరాజనం
పూలతో పూజలు..
ఆటపాటలతో ఆరాధన
పూలసంద్రమైన బతుకమ్మకుంట
పకడ్బందీ ఏర్పాట్లు..
సద్దుల వేడుకలకు భారీగా ప్రజలు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. డీసీపీ రాజమహేంద్ర నాయక్ పర్యవేక్షణలో ఏసీపీ భీంశర్మ ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణరెడ్డి, తదితర పోలీస్ స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు, ఎస్సైలు బందోబస్తు నిర్వహించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి పర్యవేక్షణలో డి.లక్ష్మీనారాయణరెడ్డి, సిబ్బంది విధులు నిర్వహించారు.


