జనగామ రూరల్: వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి డాక్టర్ టీ.కే. శ్రీదేవి కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయం, సాగు, తాగు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పశుసంవర్థక రంగం, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించేందుకు సమష్టి కృషి చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడం ద్వారా కూడా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చన్నారు.
ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలి
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లకు సూచించారు. శనివారం ఎస్‌ఐఆర్, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. వీసీ అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఫారం–6, 7, 8 లకు సంబంధించిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి పెండింగ్‌లో లేకుండా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలి
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా యాసంగి సాగులో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం యాసంగి పంటల సాగు ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నీటి నిల్వలు, భూగర్భ జలాల లభ్యతను పరిగణనలోకి తీసుకొని పంటల సాగు ప్రణాళికను రూపొందించాలన్నారు. తక్కువ నీటితో పండే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. విత్తనాల సరఫరా, విక్రయాలు, రైతులకు చేరిన విత్తనాల వివరాలను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ఎరువుల విక్రయాలపై ఫర్టిలైజర్ షాపులను తనిఖీలు చేయాలన్నారు. ఈ సమావేశంలో డీఏఓ అంబికా సోనీ, ఏడీఏలు అపర్ణ, వసంత సుగుణ, ఎంఏఓలు, ఏఈఓలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయం, సాగు, తాగునీరు, విద్యుత్ సరఫరాపై దృష్టి సారించాలి
వీసీలో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రత్యేక అధికారి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి టీ.కే. శ్రీదేవి


