జఫర్‌గఢ్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కేల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే నిర్మాణ పనులు బేస్‌మెంట్ వరకు చేరుకున్నాయి. గురుకుల విద్యా విధానంలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చేందుకు గాను ఒకేచోట పేద విద్యార్థులకు విద్యా బోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.200 కోట్ల వ్యయంతో మండలంలోని కోనాయిచలం గ్రామ రెవెన్యూ పరిధిలోని స్టేషన్‌ఘన్‌పూర్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్న 21 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పాఠశాలల భవన సముదాయ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ పనుల నిర్మాణానికి గాను గతేడాది మార్చి 16న సీఎం రేవంత్‌రెడ్డి స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో వర్చువల్‌గా శంకుస్థాపన చేయగా ఈ ఏడాది ఫిబ్రవరి 10న ఎంపీ కావ్యతో కలసి ఎమ్మెల్యే కడియం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.
అన్ని వర్గాలకు ఒకేచోట..
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన నాలుగు గురుకులాల పాఠశాల విద్యార్థులు ఒకే చోట కలిసి చదువుకునే అవకాశం లభించనుంది. పేద వర్గాలకు చెందిన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యా బోధనతో పాటు ఆధునిక మౌలిక వసతులు కల్పించనున్నారు. ఈ భవన నిర్మాణ పనులు 18 నెలల్లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం గడువు విధించింది. పనులు ప్రారంభించిన నాటి నుంచి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ భవన నిర్మాణ పనులు పూర్తయితే 2,560 మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో ఉండి 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం కలగనుంది.
బేస్‌మెంట్ దశ పూర్తి..
ఇప్పటికే భవన నిర్మాణ పనులు బేస్‌మెంట్ దశ పూర్తి అయ్యింది. కొద్దిరోజుల క్రితం మొరం విషయంలో పనులు నిలిచిపోగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకోని కలెక్టర్‌తో మాట్లాడి సదరు కాంట్రాక్టర్ ద్వారా ప్రభుత్వానికి డీడీలు కట్టించడంతో తిరిగి నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకున్నాయి. నిర్మాణ పనులు త్వరతగతిన చేపట్టేందుకు సదరు కాంట్రాక్టర్ భవన నిర్మాణ కార్మికులకు పనిచేసే చోటనే ప్రత్యేక షెడ్డులను ఏర్పాటు చేయడంతో రాత్రింబవళ్లు పనులు ముమ్మరంగా సాగతున్నాయి.
స్కూల్ నిర్మాణం కోసం రూ.200 కోట్ల కేటాయింపు
బేస్‌మెంట్ లెవల్ వరకు పూర్తయిన
పనులు
పేద విద్యార్థులకు అంతర్జాతీయ
ప్రమాణాలతో విద్య


