● పనులు పరిశీలించిన ఎమ్మెల్యే కడియం
రఘునాథపల్లి: మండలంలోని ఉత్తర ప్రాంతంలోని గ్రామాలతో పాటు ఇబ్రహీంపూర్ పెద్ద చెరువు మత్తడి నుంచి వృథాగా పోతున్న నీటిని శ్రీమన్నారాయణపురం గ్రామం వద్ద కెనాల్ ద్వారా నవాబుపేట రిజర్వాయర్‌లోకి మళ్లించామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. వాగులో వృథాగా పోతున్న వరద నీటిని కెనాల్ ద్వారా నవాబుపేట రిజర్వాయర్‌కు మళ్లించే పనులను ఆయన క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకులు, రైతులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వరద నీటి మళ్లింపుతో లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల్లోని వేలాది ఆయకట్టుకు సాగు నీరందుతుందన్నారు. అనంతరం గ్రామంలో ఇటీవల మృతి చెందిన మాచర్ల యాదగిరిగౌడ్ కుటుంబాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మారుజోడు రాంబాబు, లింగాల జగదీష్‌చందర్‌రెడ్డి, గంగిడి నరసింహారెడ్డి, లింగాజి, గాదె మహేందర్‌రెడ్డి, బొమ్మ వీరస్వామి, లోనె శ్రవణ్, గొరిగ రవి, నామాల బుచ్చయ్య, కోళ్ల రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


