సమయపాలన..పర్యవేక్షణ | - | Sakshi
Sakshi News home page

సమయపాలన..పర్యవేక్షణ

Sep 30 2026 2:04 AM | Updated on Sep 30 2026 2:04 AM

నిరంతర పర్యవేక్షణ

విద్యార్థుల హాజరు నమోదులో జాప్యం లేకుండా ఒకరికి బదులు మరొకరు హాజరు వేయడం వంటి అక్రమాలకు చెక్‌ పెట్టేందుకే ముఖ గుర్తింపు విధానాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా అధ్యాపకులు, సిబ్బంది సమయానికి విధులకు వస్తున్నారా? లేదా? అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థుల హాజరు శాతం పెరిగి, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉంది.

జనగామ రూరల్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులు బోధనపై పట్టు సాధించి పాఠ్య విషయాలు కోల్పోకుండా సమయపాలన, హాజరు విషయంలో మరింత పారదర్శకత పాటించేలా ఇంట ర్మీడియట్‌ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు ఆధారంగా నమోదు చేసే ‘ఎఫ్‌ఆర్‌ఎస్‌’ (ఫేషియల్‌ రికగ్నేషన్‌ సిస్టమ్‌) పద్ధతి అమల్లోకి తెచ్చింది. గత ఏడాది బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో ఆశించిన స్థాయిలో కొనసాగలేదు. దీంతో ఈ ఏడాది కొత్త సాఫ్ట్‌వేర్‌తో ముఖ గుర్తింపు హాజరు విధానానికి శ్రీకారం చుట్టింది. దీంతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అమలు చేస్తున్నారు. అయితే ఇటీవల కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం అమలుపై డీఐఈఓ, సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. అన్ని కళాశాలల్లో తప్పనిసరిగా చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నారు.

రోజుకు రెండు పూటల ఫొటోలు

ప్రత్యేకంగా రూపొందించిన ప్రత్యేక యాప్‌ టీజీబీఐఈ (తెలంగాణ బోర్డు ఆఫ్‌ ఇంటర్మీడియట్‌ ఎడ్యుకేషన్‌) ద్వారా హాజరును నమోదు చేస్తున్నారు. కళాశాలల్లో విధులు నిర్వహించే అధ్యాపకులు, సిబ్బంది రోజుకు రెండుసార్లు (ఉదయం 9.30 గంటలలోపు, సాయంత్రం 4 గంటలకు) ముఖ గుర్తింపుతో హాజరు నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. విద్యార్థుల హాజరును కూడా ఇదే విధానంలో నమోదు చేస్తున్నారు. మొబైల్‌లో కొత్త యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం, దాని వినియోగంపై ఇప్పటికే అధ్యాపకులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.

7 ప్రభుత్వ కళాశాలలు

జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి సుమారు 2,500 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరితో పాటు 200వరకు అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే సిబ్బంది రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కాగా, ప్రస్తుతం విద్యార్థుల వివరాల నమోదు కొనసాగుతోంది.

సమర్థ పర్యవేక్షణ కోసమే..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థుల హాజరును మరింత పారదర్శకంగా నమోదు చేయడంతో పాటు సమయపాలన పాటించేలా చేయడమే ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానం ప్రధాన ఉద్దేశం. టీజీబీఐఈ యాప్‌ ద్వారా ముఖ గుర్తింపు ఆధారంగా హాజరు నమోదు జరుగుతుంది. పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన తర్వాత కళాశాలల పనితీరును మరింత సమర్థంగా పర్యవేక్షించే అవకాశం ఉంటుంది.

– సందీప్‌ కుమార్‌ ఝా, కలెక్టర్‌

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ‘ముఖ గుర్తింపు హాజరు’ విధానం

రోజుకు రెండుసార్లు ఎఫ్‌ఆర్‌ఎస్‌

అటెండెన్స్‌

అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులకు పూర్తిస్థాయిలో వర్తింపు

‘టీజీబీఐఈ’ యాప్‌ ద్వారా నమోదు

ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న

అధికారులు

జిల్లాలో 7 కళాశాలలు,

2,500 మందిపైగా విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement