శిశువు భద్రత కట్టుదిట్టం | - | Sakshi
Sakshi News home page

శిశువు భద్రత కట్టుదిట్టం

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

ఎస్‌ఎన్‌సీయూలో మూడు స్థాయిల్లో సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఫీడింగ్‌, ఫొటోథెరపీ, డీఎంఓ మానిటరింగ్‌ తదితర సేవలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వార్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను సూపరింటెండెంట్‌ గదికి అనుసంధానం చేశారు. అనుమతిలేని వ్యక్తులు లోనికి ప్రవేశించకుండా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉంటున్నారు. ఇటీవల ఎస్‌ఎన్‌సీయూ నుంచి ఓ శిశువును ఎత్తుకెళ్లిన ఘటనలో ఆస్పత్రి సిబ్బంది, సెక్యూరిటీ వెంటనే స్పందించి గంటల వ్యవధిలోనే శిశువును గుర్తించడం ఇందుకు ఉదాహరణ.

జనగామ: జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌)లోని నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ)లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. ఎంసీహెచ్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో మూడు వార్డులు ఉండగా ప్రస్తుతం 15 మంది నవజాత శిశువులకు వైద్యసేవలు అందుతున్నాయి. వీరిలో నలుగురు క్రిటికల్‌ కేర్‌లో, మరో 11 మంది సాధారణ పరిశీలనలో ఉన్నారు.

విద్యుత్‌పై ప్రత్యేక దృష్టి

ఎస్‌ఎన్‌సీయూలోని సుమారు 80 శాతం పరికరాలు విద్యుత్‌పై ఆధారపడి పనిచేస్తున్నాయి. వార్మర్లు, ఇంక్యుబేటర్లు, పల్స్‌, బీపీ, సాచురేషన్‌ మల్టీ ప్యారామీటర్లు, సిరంజి పంపులు, ఫొటోథెరపీ, వెంటిలేటర్లు, సీపాప్‌ పరికరాలతో పాటు ఏసీలు, కంప్యూటర్లు, ప్రింటర్లు, ఇతర పవర్‌ పరికరాలు వినియోగంలో ఉన్నాయి. విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే అత్యవసర సేవల కోసం జనరేటర్‌ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. సాంకేతిక లోపాలు, ప్రమాదాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు విద్యుత్‌ ఆడిటింగ్‌ నిర్వహించడంతో పాటు ఇంజినీరింగ్‌ విభాగం తనిఖీలు చేపడుతోంది. ఎంసీహెచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఎస్‌ఎన్‌సీయూలో విద్యుత్‌ సంబంధిత సాంకేతిక సమస్యలు తలెత్తలేదని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వం అప్రమత్తం

ఆదిలాబాద్‌ రిమ్స్‌లో చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంసీహెచ్‌లలోని ఎస్‌ఎన్‌ సీయూ వార్డుల భద్రత, వసతులపై ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. ఇందుకు చెక్‌లిస్ట్‌ పంపడంతో పాటు ఏసీ లు, విద్యుత్‌ సేవలకు సంబంధించి సమస్యలు ఉంటే వెంటనే నివేదించాలని ఆదేశాలు జారీ చేసింది.

భద్రతకు అత్యంత ప్రాధాన్యం

ఎంసీహెచ్‌లోని ఎస్‌ఎన్‌సీయూలో నవజాత శిశువుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. 24 గంటల పాటు వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణ ఉంటుంది. సీసీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా కొనసాగుతోంది. విద్యుత్‌ అంతరాయం ఏర్పడినా సేవలకు ఆటంకం కలగకుండా జనరేటర్‌ అందుబాటులో ఉంది. విద్యుత్‌ పరికరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ, సాంకేతిక లోపాలు తలెత్తకుండా ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నాం.

–డాక్టర్‌ మధుసూదన్‌రెడ్డి,

ప్రొఫెసర్‌, హెచ్‌ఓడీ పీడియాట్రిక్స్‌

జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎన్‌సీయూపై ప్రత్యేక నిఘా..

నవజాత శిశువుల కేంద్రంలో

24 గంటల పర్యవేక్షణ

విద్యుత్‌ సమస్యలు తలెత్తకుండా

ఎప్పటికప్పుడు ఆడిటింగ్‌

ఆదిలాబాద్‌ ఘటనతో అప్రమత్తం

ఓపీ సేవల వద్ద ఉక్కపోత

24 గంటల పర్యవేక్షణ

ఓపీలో ఉక్కపోత

ఎస్‌ఎన్‌సీయూలో భద్రతా చర్యలు పటిష్టంగా ఉన్నప్పటికీ ఎంసీహెచ్‌ ఓపీ సేవల వద్ద మరో సమస్య కనిపించింది. ప్రధాన హాల్‌లో సరైన వసతి సౌకర్యాలు ఉన్నప్పటికీ, పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండే గర్భిణులు, బాలింతలు ఫ్యాన్లు లేకపోవడంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement