నిమజ్జనానికి వేళాయె | - | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి వేళాయె

Sep 23 2026 1:13 AM | Updated on Sep 23 2026 1:13 AM

జనగామ: జిల్లాలో ఈనెల 23న (బుధవారం) జరగనున్న వినాయక నిమజ్జనానికి యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆదేశాల మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. జిల్లాలో మొత్తం 770 చెరువులు ఉండగా, 2 వేలకుపైగా వినాయక ప్రతిమలు కొలువుదీరాయి. నిమజ్జనానికి ప్రధాన కేంద్రంగా నెల్లుట్ల చెరువు వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రం, లింగాల ఘణపురం, నెల్లుట్ల ప్రాంతాలకు చెందిన సుమారు 600 నుంచి 800 వరకు వినాయక విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం చేసే అవకాశం ఉండటంతో భారీ ఏర్పాట్లు చేశారు.

వర్షం వచ్చినా.. ఇబ్బంది లేకుండా

నెల్లుట్ల చెరువు నిమజ్జన ప్రాంతానికి సమీపంలో సుమారు 100 మీటర్ల మేర రోడ్డును ఫార్మేషన్‌ చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ వర్షం కురిసినా వాహనాలు బురదలో కూరుకుపోకుండా, నిమజ్జన కార్యక్రమానికి ఎలాంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. చెరువు వద్ద రెండు భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి వచ్చే నిర్వాహకులు, భక్తుల రాకపోకలకు ప్రత్యేక ఎంట్రీ, ఎగ్జిట్‌ గేట్లను ఏర్పాటు చేశారు. రెండు బోట్లను అందుబాటులో ఉంచారు.

12 సీసీ కెమెరాలు.. 180 లైట్లు

నెల్లుట్ల చెరువు చుట్టూ 12 సీసీ కెమెరాలు, 180 లైట్లు ఏర్పాటు చేశారు. వీటిని మూడు లొకేషన్ల ద్వారా ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. నిమజ్జన ప్రక్రియ, శోభాయాత్ర, చెరువు పరిసరాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించనున్నారు. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూమ్‌ను సిద్ధం చేశారు.

వ్యర్థాలు వేరుగా..

నిమజ్జనంలో ఈసారి కొత్త విధానాన్ని అమలు చేస్తున్నారు. వినాయక విగ్రహాలతో పాటు వచ్చే పూల మాలలు, ఇతర వ్యర్థాలను చెరువులో వేయకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాల్లో సేకరించనున్నారు. వ్యర్థాలను తొలగించిన అనంతరం ఖాళీ విగ్రహాన్ని నిమజ్జనం చేసేలా చర్యలు చేపట్టారు. ఇందుకు 30 మంది పారిశుధ్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు.

40 మంది గజ ఈతగాళ్లు

నెల్లుట్ల చెరువు వద్ద 40 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. వీరు 20 మంది చొప్పున మూడు షిఫ్టుల్లో సేవలందించనున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో నిరంతరాయంగా మెడికల్‌ క్యాంపులు, 108 అంబులెన్స్‌, ఫైర్‌ సేఫ్టీ, విద్యుత్‌ శాఖ ప్రత్యేక బృందాలు సేవలందించనున్నాయి.

300 మంది బందోబస్తు

డీసీపీ రాజామహేంద్ర నాయక్‌ ఆధ్వర్యంలో ఏసీపీలు, ఎస్సైలతోపాటు 300 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఇతర ప్రధాన నిమజ్జన కేంద్రాలైన నర్మెట, చిల్పూరు మండలాలు గండిరామారం రిజర్వాయర్‌, బచ్చన్నపేట గుడి చెరు వు, పాలకుర్తి, తొర్రూరు(జే), దేవరుప్పుల ధర్మాపురం చెరువు, కొడకండ్ల రామవరం చెరువు, తరి గొప్పుల, రఘునాథపల్లి, ఇబ్రహీంపురం తదితర ప్రాంతాల్లోనూ ఏర్పాట్లు చేశారు. ఘన్‌పూర్‌, పాలకుర్తి చెరువుల వద్ద ఒక్కో క్రేన్‌ ఏర్పాటు చేశారు.

నేటినుంచి 25 వరకు అధికారుల విధులు

ఈ నెల 23 నుంచి 25వ తేదీ తెల్లవారుజాము వరకు అన్ని శాఖల జిల్లా అధికారులు విధుల్లో ఉండనున్నారు. జనగామ మున్సిపాలిటీలోని 30 వార్డుల వార్డు అధికారులు మూడు షిఫ్టుల్లో సేవలందించనున్నారు. నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయనున్నారు. నిమజ్జనం సందర్భంగా ఈ నెల 23 నుంచి 24వ తేదీ సాయంత్రం 6 గంటల వ రకు జిల్లాలోని వైన్స్‌, బార్లు మూసివేయాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

నెల్లుట్ల చెరువు వద్ద భారీ ఏర్పాట్లు

పట్టణంలో 2వేలకు పైగా

గణనాథుల ప్రతిమలు

రెండు భారీ క్రేన్లు, నాలుగు బోట్లు సిద్ధం

నేటి నుంచి రేపు సాయంత్రం 6 వరకు వైన్స్‌, బార్లు బంద్‌

భద్రతకు ప్రాధాన్యం..

వినాయక నిమజ్జనంలో భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. నీటిలోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేశాం. 24 గంటలు పనిచేసేలా కంట్రోల్‌ రూం, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుంది. నిమజ్జన ఘాట్ల వద్ద భద్రతతో పాటు శోభాయాత్ర సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. అత్యవసర సేవలన్నీ అందుబాటులో ఉంచాం.

–సందీప్‌కుమార్‌ ఝా, కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement