లింగాలఘణపురం: ఇందిరమ్మ ఇల్లు ఆశించి చివరికి ఆ ఆశ తీరకముందే ఓ మహిళ అనంతలోకాలకు వెళ్లింది. ఈ ఘటన మండలంలోని నాగారంలో జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మద్దూరి లక్ష్మి (58), చంద్రయ్య దంపతులు సోమవారం రాత్రి తమ పెంకుటింట్లో నిద్రిస్తున్నారు. భర్త మంచంపై పడుకోగా లక్ష్మి పక్కనే నేలపై పడుకుంది. అర్ధరాత్రి పెద్ద మట్టిపెళ్ల ఆమె తలపై పడగా గాయపడి స్పృహ కోల్పోయింది. మట్టి పెళ్ల చప్పుడుతో భర్త చంద్రయ్య లేచి చూడగా తలకు గాయాలై ఉండడంతో మరో గదిలో నిద్రి స్తున్న కొడుకు, కోడలిని లేపి వెంటనే జనగామలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించగా చికిత్స పొందు తూ మంగళవారం మృతి చెందింది. రెండో విడతలోనైనా ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశించిన లక్ష్మి చివరికి గోడ కూలి చనిపోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. లక్ష్మికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.
ఇందిరమ్మ ఇల్లు కోసం రెండుసార్లు
దరఖాస్తు చేసిన మహిళ
చివరికి శిథిలావస్థలో ఉన్న
ఇల్లు గోడ కూలీ మృతి


