జనగామ: చిన్నారుల్లో అధిక చక్కెర వినియోగాన్ని నియంత్రించి ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించేందుకు జిల్లాలోని ప్రతీ పాఠశాలలో ‘షుగర్ బోర్డు’ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశాలు జారీ చేశారు. జాతీయ పోషణ్ మాహ్–2026లో భాగంగా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎన్ సీపీసీఆర్) సూచనల మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.
అన్ని యాజమాన్యాల పాఠశాలలకు వర్తింపు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కేటగిరీలకు చెందిన 586 పాఠశాలల యాజమాన్యాల పాఠశాలల్లో షుగర్ బోర్డుల ఏర్పాటుకు సంబంధించి ఆదేశాలు వర్తించనున్నాయి. నోడల్ అధికారిగా జిల్లా విద్యాశాఖాధికారి, అసిస్టెంట్ నోడల్ అధికారిగా డిప్యూటీ విద్యాశాఖాధికారిని నియమించారు. మండల విద్యాధికారులు తమ పరిధిలోని అన్ని పాఠశాలలకు నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు.
పాఠశాలకు 50 మీటర్ల దూరంలో
పాఠశాలల్లో మెస్, హాస్టల్ వంటశాలల్లో కార్బొనేటెడ్ పానీయాలు, ప్యాకేజ్డ్ తీపి పానీయాలు, అధిక కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలు విక్రయించకూడదు. హైస్కూల్ గేట్లకు 50 మీటర్ల పరిధిలోని విక్రేతలను ఫుడ్ సేఫ్టీ అధికారులు తరుచూ తనిఖీ చేయాలి. మండల విద్యాధికారులు కనీసం 20 శాతం పాఠశాలల్లో బోర్డులను భౌతికంగా పరిశీలించాలి. మండల స్థాయి నివేదికలను అక్టోబర్ 5లోగా, జిల్లా నివేదికను అక్టోబర్ 7లోగా సమర్పించి, ఎన్‌సీపీసీఆర్‌కు అక్టోబర్ 9లోగా పంపించనున్నారు.
షుగర్ బోర్డులో ఇవి తప్పనిసరి
పాఠశాలల్లో ఏర్పాటు చేసే షుగర్ బోర్డుల్లో కేవలం చక్కెర పరిమాణాలే కాకుండా పలు ముఖ్యమైన ఆరోగ్య సూచనలు తప్పనిసరిగా పొందుపరచాలి. ఆహార పదార్థాల లేబుళ్లలో చక్కెరను సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, డెక్స్‌ట్రోజ్, మాల్టోజ్, కార్న్ సిరప్, హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, ఇన్వర్ట్ షుగర్, మాల్టోడెక్స్‌ట్రిన్, తేనె, బెల్లం, ఫ్రూట్ జ్యూస్ కాన్సన్ ట్రేట్ తదితర పేర్లతో పేర్కొనే అవకాశం ఉందని విద్యార్థులకు తెలియజేయాలి. న్యూట్రిషన్‌న్ లేబుల్‌లోని టోటల్ షుగర్స్‌ను పరిశీలించాలని, 100 గ్రాములకు 22.5 గ్రాములకుపైగా చక్కెర అధికంగా, 5 గ్రాములు లేదా అంతకంటే తక్కువగా పరిగణిస్తారని బోర్డులో వివరించాలి.
– సందీప్ కుమార్ ఝా, కలెక్టర్
ప్రతీ పాఠశాలలో షుగర్ బోర్డుల ఏర్పాటు
ఈనెల 25లోగా బోర్డుల ఏర్పాటు
పిల్లల ఆరోగ్యంపై కలెక్టర్ నజర్
అన్ని యాజమాన్యాల పాఠశాలలకు
ఆదేశాలు
ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో బోర్డు ఏర్పాటుకు సమగ్ర శిక్షలోని కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ వినియోగించుకోవచ్చు. అది అందుబాటులో లేకుంటే పాఠశాలకు అందుబాటులో ఉన్న ఇతర గ్రాంట్లను ఉపయోగించాలి. ఎయిడెడ్, ప్రైవేట్, రెసిడెన్షియల్ సంస్థలు తమ సొంత నిధులతో ఏర్పాటు చేయాలి.
30లోగా పోషణ్ మిత్ర వీడియో
25 గ్రాములకే పరిమితమా
పాఠశాలల్లో ఏర్పాటు చేసే షుగర్ బోర్డులో రోజుకు పిల్లలు తీసుకునే అదనపు చక్కెర 25 గ్రాములకు మించకూడదని, అంటే సుమారు ఆరు టీ స్పూన్లకు పరి మితం చేయాలని సూచించారు. రెండు సంవత్సరాల లోపు పిల్లలకు అదనపు చక్కెర ఇవ్వకూడదని పేర్కొన్నారు. సాధారణంగా పిల్లలు తినే ఆహార పదార్థాల్లో దాగి ఉన్న చక్కెర వివరాలను కూడా బోర్డులో పొందుపరచాలి. 300 మిల్లీలీటర్ల కార్బొనేటెడ్ శీతల పానీయంలో సుమారు 32 గ్రాముల చక్కెర, 200 మిల్లీ లీటర్ల ప్యాకేజ్డ్ ఫ్రూట్ డ్రింక్‌లో 24 గ్రాములు, 250 మిల్లీ లీటర్ల ఎనర్జీ డ్రింక్‌లో 27 గ్రాములు, 50 గ్రాముల చాక్లెట్‌లో 25 గ్రాములు, 100 గ్రాముల క్రీమ్ బిస్కెట్లలో 30 గ్రాముల చక్కెర ఉంటుందని నమూనా బోర్డులో పేర్కొన్నారు.
అధిక చక్కెరతో అనర్థాలు
అధిక చక్కెర తీసుకోవడం వల్ల అధిక బరువు, స్థూలకాయం, టైప్–2 మధుమేహం, దంతక్షయం, ఫ్యాటీ లివర్, భవిష్యత్తులో అధిక రక్తపోటు, తరగతిలో ఏకాగ్రత తగ్గడం, నిద్రలో అంతరాయం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని బోర్డులో అవగాహన కల్పించారు. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, సాధారణ పాలు, పెరుగు, తాజా పండ్లు, శనగలు, వేరుశనగలు, మొలకలు, మధ్యాహ్న భోజనం వంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని పేర్కొన్నారు.
25లోగా ఏర్పాటు
ప్రతీ పాఠశాలలో ఇందుకు సంబంధించి విద్యార్థులకు కనిపించేలా తెలుగు, ఇంగ్లిష్‌లో బోర్డు ఏర్పాటు చేయాలి. బోర్డు ఏర్పాటును ఈనెల 25లోగా పూర్తి చేసి, అదే రోజు జియోట్యాగ్ ఫొటోను సంబంధిత మండల విద్యాధికారి (ఎంఈఓ)కు పంపాలి. బోర్డుపై ఎలాంటి ఉత్పత్తి ప్రకటనలు, బ్రాండ్ పేర్లు ఉం డకూడదు. పాఠశాల పేరు, చేసిన తేదీ తప్పనిసరిగా ఉండాలి. ప్రైవేట్ పాఠశాలల విషయంలో నిబంధనల ఉల్లంఘనను ఆ పాఠశాల గుర్తింపు (రికగ్నిషన్)కు సంబంధించిన ఫైల్‌లో నమోదు చేయనున్నారు.
పోషణ్ మిత్ర ఆరోగ్యకర ఆహారంపై అవగాహన వీడియోను ఈనెల 30లోగా ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు ప్రదర్శించాలి. ప్రతీ పాఠశాలలో కనీసం ఒకరోజు ఉదయం అసెంబ్లీలో హిడెన్ షుగర్‌పై అవగాహన కల్పించడంతో పాటు 6వ తరగతి ఆపై విద్యార్థులకు ఆహార లేబుళ్లపై చక్కెర వివరాలు చదవడం గురించి ప్రత్యేక సెషన్ నిర్వహించాలి.


