సత్వర పరిష్కారానికే ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సత్వర పరిష్కారానికే ప్రాధాన్యం

Sep 22 2026 12:54 AM | Updated on Sep 22 2026 12:54 AM

మండలాల్లో 181 అర్జీలు

● కలెక్టరేట్‌ ప్రజావాణిలో అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

● ప్రజల నుంచి 481 అర్జీల స్వీకరణ

జనగామ రూరల్‌: పలు సమస్యలతో ప్రజలు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి తరలివచ్చారు. ఈసందర్భంగా అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని పెండింగ్‌లో గల అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజావాణిలో మొత్తం 481 దరఖాస్తులను కలెక్టర్‌ స్వీకరించారు. జెడ్పీ సీఈఓ బలరామ రావు, డీఆర్డీఓ భాస్కర్‌, సీపీఓ చినకోట్యా నాయక్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తుల్లో కొన్ని ఇలా..

రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామానికి చెందిన సీహెచ్‌.అఖిల..ప్రజాపాలన కార్యక్రమం కింద దరఖాస్తు చేసుకున్నారని, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఆర్థిక సహాయం మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం ఛాగల్‌ గ్రామానికి చెందిన సత్తు పోశాలు, తన ఒక ఎకరం 17 గుంటల భూమి, 2018 నుంచి తన పేరుపై రావడం లేదని, దానిని రద్దు చేసి తన పేరు భూమి పట్టా ఇప్పించాలని దరఖాస్తు అందజేశారు.

దేవరుప్పుల మండలం సీతాపురం గ్రామానికి చెంది న డి.సత్తయ్య, తన భూమిని సర్వే చేసి, హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు.

నర్మెట మండలం కన్నెబోయినగూడెం గ్రామానికి చెందిన కలకుంట్ల అయిలమ్మ, తనకు స్థలం ఉందని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరుతూ దరఖాస్తు ఇచ్చారు.

మొండ్రాయి గ్రామానికి చెందిన దేపాటి ఉమాలత తన కుమారుడు 5వ తరగతి చదువుతున్నాడని, స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఆదాయ ధ్రువీకరణ పత్రం అవపరం కాగా మీసేవలో దరఖాస్తు చేసుకున్నానని తెలిపింది. తనకు లక్షా యాబై వేల రూపాయలు ఆదాయం ఉందని అధికారులు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని, లక్ష లోపు ఆదాయం ఉంటేనే స్కాలర్‌ షిప్‌కు అర్హులని వాపోయింది. తన భర్త అనారోగ్యంతో మృతి చెందగా తనతల్లిగారి ఇంటి వద్ద ఉంటూ కూలీ పని చేసుకోని కాలం వెల్లదీస్తున్నామని, అధికారులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరింది.

జిల్లాలోని 12 మండలాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 181 దరఖాస్తులు ఆయా మండల స్థాయి అధికారులు స్వీకరించారని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా తెలిపారు. ఇందులో రఘునాథపల్లి 34 , లింగాల గణపురం 32, అత్యధికం రాగా దేవరుప్పుల, కొడకండ్ల, స్టేషన్‌ఘన్‌పూర్‌లో 5 చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు.

ఇల్లు మంజూరు చేయండి..

పట్టణంలో 12 ఏళ్లుగా అద్దె భవనంలో ఉంటున్నాం. ముగ్గురు పిల్లలు కాగా నేను, నా భర్త సయ్యద్‌ కూలి పనులకు వెళ్తూ వచ్చే డబ్బులతో కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ఇందిరమ్మ ఇల్లు కో సం ఆన్‌లైన్‌లో మూడు సార్లు దరఖా స్తు చేసినా మంజూరు కాలేదు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కలెక్టర్‌ ఆదుకోవాలి.

–హసీయా బేగం, గిర్నిగడ్డ, జనగామ

పొలానికి దారి ఇవ్వడం లేదు

కోమళ్ల నుంచి వీరారెడ్డి తండాకు బీటీ రోడ్డు మధ్య నుంచి సర్వే నెం.403/ఏ123లో 2ఎకరాల15 గుంటల వ్యవసాయ భూమి నా భర్త బాలాజీ పేరు మీద ఉంది. 30 సంవత్సరాల నుంచి వినియోగంలో ఉండగా ఇటీవల గ్రామానికి చెందిన కొంత మంది తనకు దారి లేదని సాగు చేయకుండా అడ్డుకుంటున్నారు. నా భర్త, కుమారుడు మరణించి ఒంటరిని కావడంతో దారి నుంచి వెళ్లనివ్వడం లేదు. కలెక్టర్‌ న్యాయం చేయాలి.

–హలావత్‌ జ్యోతి, కోమళ్ల గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement