● వైభవంగా వినాయక వివాహా
మహోత్సవం
● కల్యాణఘట్టంతో పులకించిన భక్తజనం
జనగామ: జిల్లా కేంద్రంలోని గణేశ్ వాడలో భక్తి శ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా బొర్ర వెంకయ్య ఆలయ ప్రాంగణంలోని సుమారు 120 ఏళ్ల చరిత్ర కలిగిన గణపతి ఆలయంలో సోమవారం శ్రీ సిద్ధి బుద్ధి సమేత మహా గణపతి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వేద పండితులు ప్రసాద శర్మ, చిదంబరం శాస్త్రి మంత్రోచ్ఛరణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణ క్రతువు నిర్వహించారు. సిద్ధి, బుద్ధి సమేతంగా కొలువైన విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, కల్యాణ ఘట్టాన్ని వైభవంగా జరిపారు. కాణిపాకం, సికింద్రాబాద్, కాజీపేటలోని ప్రసిద్ధ గణపతి ఆలయాల్లో జరిగే కల్యాణోత్సవాల తరహాలో ఏటా జనగామలోనూ సిద్ధి బుద్ధి సమేత మహా గణపతి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడం ప్రత్యేకత సంతరించుకుంది.
భక్తజన సందోహం మధ్య ఊరేగింపు
కల్యాణ మహోత్సవానికి అనుబంధంగా గణేశ్ వాడ కాలనీలోని సిద్ధి బుద్ధి గణేశ్ దేవాలయం ఆధ్వర్యంలో సిద్ధి బుద్ధి గణేశుడి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. దేవాలయం నుంచి వాస్తు గణపతి దేవాలయం, రైల్వేస్టేషన్, చెన్నకేశవస్వామి దేవాలయం వీధుల మీదుగా సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు ఊరేగింపు కొనసాగింది. అనంతరం స్వామివారిని తిరిగి దేవాలయానికి తీసుకు వచ్చారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బాలమణి శ్రీనివాస్ ముఖ్యఅతిథులుగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నాయకులు గాడిపల్లి ప్రేమలతరెడ్డి, తాళ్ల సురేష్‌రెడ్డి, గునిగంటి రామకృష్ణ, ఉల్లెంగుల సందీప్, ఆలేటి నరేందర్, గోపగోని సుగుణాకర్ గౌడ్, సేవెల్లి మధు, దోర్నాల అనిత పాల్గొన్నారు.


