● రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనగామ రూరల్: రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్రంలోని అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ, అటవీ భూముల పరిహారం, పునరావాసం–పునరావాస పునరుద్ధరణ (ఆర్‌అండ్‌ఆర్) పనుల పురోగతిపై మంత్రి ఉత్తమ్.. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. భూసేకరణ లబ్ధిదారులకు పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలన్నారు. భూసేకరణ నిబంధనల ప్రకారం జరగాలని, రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పరిహారం మార్కెట్ విలువకు సాధ్యమైనంత సమీపంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రవాణా శాఖ మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటికే అవార్డులు జారీ చేసిన భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపులను మొదటి ప్రాధాన్యంగా పూర్తి చేయాలన్నారు. వీసీలో నీటిపారుదల శాఖ ఎస్‌ఈ సీతారాం, అధికారులు పాల్గొన్నారు.


