పురపాలిక..ప్రగతి ఉరక | - | Sakshi
Sakshi News home page

పురపాలిక..ప్రగతి ఉరక

Sep 19 2026 5:50 AM | Updated on Sep 19 2026 5:50 AM

ఆక్రమణలపై నిఘా.. అభివృద్ధి పనులకు ఊతం

చెత్త డంపింగ్‌ యార్డుకు బాబ్‌క్యాట్‌

జనగామ: పురపాలిక పరిధిలో ఎన్‌క్రోచ్‌మెంట్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలు, ఇరుకై న రోడ్లపై వ్యాపార, వాణిజ్య సంస్థల బోర్డులు ఏర్పాటు చేయడం, రహదారులను బ్లాక్‌ చేసే చర్యలపై ఇకనుంచి అధికారుల నిఘా పెరగనుంది. పట్టణంలో ప్రధాన రహదారులతో పాటు వాణిజ్య ప్రాంతాలపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టేందుకు ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్‌ (విజిలెన్స్‌) బృందాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బాలమణి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో, కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి పర్యవేక్షణ, ప్రభుత్వం, కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సహకారంతో పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రూ.90లక్షలతో 16వ ఆర్థిక సంఘం, జనరల్‌ ఫండ్‌ నిధులు, కలెక్టరేట్‌ బడ్జెట్‌ నుంచి మరో రూ.57 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకు సంబంధించి కౌన్సిల్‌ ఆమోదం పొందగా, ఇక టెండర్లను పిలిచేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ప్రధాన రహదారులపై ప్రత్యేక దృష్టి

సిద్దిపేట, హైదరాబాద్‌, సూర్యాపేట, హనుమకొండ ప్రధాన రహదారులతో పాటు స్వర్ణ కళామందిర్‌, బాలాజీనగర్‌, రైల్వేస్టేషన్‌, నెహ్రూ పార్క్‌, అమ్మబావి తదితర వాణిజ్య ప్రాంతాలపై నిఘా పెట్టనున్నారు. పట్టణంలోని 30 వార్డుల పరిధిలో బృందం నిరంతరం పర్యటిస్తూ ఆక్రమణలు, రహదారులపై అడ్డంకులు, ఇతర సమస్యలను గుర్తించనుంది. ఇందుకోసం 16వ ఫైనాన్స్‌, జనరల్‌ ఫండ్‌ నుంచి రూ.18 లక్షలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనం కొనుగోలుకు మున్సిపల్‌ కౌన్సిల్‌ తీర్మానం చేసింది. శానిటేషన్‌, టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో కూడిన బృందం ఈ వాహనంలో పట్టణంలో పర్యటించనుంది.

వీధిలైట్ల నిర్వహణకు స్కైలిఫ్ట్‌

30వార్డుల పరిధిలో వీధిలైట్లు, ఇతర ఎలక్ట్రికల్‌ పనుల మరమ్మతులు, నూతన లైట్ల ఏర్పాటుకు రూ.32 లక్షలతో స్కైలిఫ్ట్‌ కొనుగోలుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. దీంతో విద్యుత్‌ సంబంధిత పనులను వేగంగా చేపట్టేందుకు అవకాశం ఏర్పడడమే కాకుండా, నిధులు సైతం ఆదా అయ్యే అవకాశం ఉంటుంది.

ప్రభుత్వ భవనాల్లో అభివృద్ధి పనులు

కలెక్టర్‌ నిధుల(డీఎంటీ)ద్వారా జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రూ.21 లక్షలతో సీసీ రోడ్లు, చంపక్‌హిల్స్‌ ఎంసీహెచ్‌లో రూ.7 లక్షలతో సీసీ రోడ్లు, కలెక్టరేట్‌ ప్రాంగణంలో రూ.29 లక్షలతో కాంపౌండ్‌ వాల్‌, టైల్స్‌ నిర్మాణ పనులు టెండర్ల దశకు చేరుకున్నాయి.

మున్సిపల్‌ స్థలాలకు రక్షణ

పురపాలక పరిధిలోని వెంచర్ల ద్వారా మున్సిపాలిటీకి కేటాయించిన 14 ప్లేసుల్లోని స్థలాలను రక్షించేందుకు రూ.10 లక్షలతో ప్రత్యేక కంచె ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను రెండు, మూడు రోజుల్లో ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొత్త వాహనాలకు త్వరలో ప్రారంభోత్సవాలు

పట్టణ పారిశుధ్య నిర్వహణలో భాగంగా 16 నూతన చెత్త సేకరణ ఆటోలు, ఒక జేసీబీ కొనుగోలు చేశారు. వీటి ప్రారంభోత్సవంతో పాటు వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు మున్సిపల్‌ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ నెలలో మంత్రి పొంగులేటి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిగే అవకాశం ఉంది.

రూ.18 లక్షలతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వాహనం

రూ.32 లక్షలతో స్కైలిఫ్ట్‌

చెత్త తరలింపునకు రూ.30 లక్షలతో బాబ్‌క్యాట్‌ యంత్రం

చంపక్‌హిల్స్‌ డంపింగ్‌ యార్డులో తడి, పొడి చెత్తను తరలించేందుకు రూ.30 లక్షలతో బాబ్‌క్యాట్‌(మినీ జేసీబీ)కొనుగోలుకు కౌన్సిల్‌ ఆమోదం తీసుకుంది. పట్టణం నుంచి తరలించిన చెత్తను డంపింగ్‌ యార్డు నుంచి తడి, పొడి చెత్త తయారీ కేంద్రానికి తరలించడం, యార్డులో రహదారులకు అడ్డంగా పేరుకుపోయిన చెత్తను తొలగించ డం వంటి పనులకు దీనిని వినియోగించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement