జనగామ రూరల్: జిల్లాలోని గ్రామ పంచాయతీల భద్రతకు, అభివృద్ధి, నేరాల అదుపు, పారదర్శక పాలనకు సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేసేందుకు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా శ్రీకారం చుట్టారు. జిల్లావ్యాప్తంగా సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు మొత్తం రూ.కోటి 50 లక్షలు మంజూరయ్యాయని రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ రాజమహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్‌షాలోమ్‌తో కలిసి కలెక్టర్ పంచాయతీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై సమీక్షించారు..
ప్రతీ గ్రామంలో రెండు సీసీ టీవీ కెమెరాలను గ్రామ ప్రవేశ, నిష్క్రమణ (ఎంట్రీ–ఎగ్జిట్) ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టేలా చర్యలు తీసుకుటుంటున్నారు. మొదటి దశలో మండలాల వారీగా మొత్తం 753 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ ఈ–టెండర్ విధానంలోనే చేపట్టాలని, జి.ఓ.నెం.52 నిబంధనల ప్రకారం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు. టెండర్ నోటిఫికేషన్‌ను సంబంధిత వెబ్‌సైట్‌లో కూడా తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు కోసం అవసరమైన కేబుల్ నెట్‌వర్క్, ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్, వీడియో వాల్స్ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ముఖ్యంగా జాతీయ రహదారులు, మండల కేంద్రాల పరిసర ప్రాంతాల్లో సీసీ టీవీ పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సమీక్షలో డీపీఓ వెంకట్‌రెడ్డి, ఏసీపీలు భీంశర్మ, నర్సయ్య, డీ సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, సీ సెక్షన్ సూపరింటెండెంట్ ఫణికిశోర్, ఎస్‌హెచ్‌ఓలు పాల్గొన్నారు.
బచ్చన్నపేట – 56, నర్మెట– 38, తరిగొప్పుల – 34, జనగామ రూరల్ – 167, లింగాల ఘణపురం – 54, రఘునాథపల్లి – 84, చిల్పూర్ – 42, స్టేషన్ ఘన్‌పూర్– 38, జఫర్‌గఢ్– 46, పాలకుర్తి – 80, కొడకండ్ల – 46, దేవరుప్పుల – 68 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
గ్రామాల అభివృద్ధి నేరాల అదుపునకు సీసీ కెమెరాలు కీలకంగా ఉపయోగపడనున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని జీపీల్లో రెండు చొప్పున ఏర్పాటు చేయనున్నాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ టెండర్ ద్వారా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.
జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ కెమెరాల ఏర్పాటు
రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ–టెండర్
రూ. కోటి 50 లక్షలతో నిధులు:
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


