కాజీపేట అర్బన్: కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఏళ్ల కల నెరవేరనుంది. విద్యార్థుల శ్రమ, అకుంఠిత దీక్షకు ఈనెల 19, 20వ తేదీల్లో ‘పట్టా’భిషేకం జరగనుంది. నిట్ వరంగల్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో 24వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యాంపస్‌లోని హోమీ బాబా సెమినార్‌హాల్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ మాట్లాడుతూ.. విద్యార్థి జీవితంలో డిగ్రీ పట్టాల స్వీకరణ కీలక ఘట్టం అన్నారు. స్నాతకోత్సవం గురించి ఆయన తెలిసిన వివరాల ప్రకారం.. నిట్ 24వ కాన్వకేషన్–26లో రెండు రోజుల పాటు 1,997 మంది యూజీ, పీజీ విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. తొలి రోజు శనివారం ఉదయం 10 గంటల నుంచి స్నాతకోత్సవం ప్రారంభం అవుతుంది. యూజీ విద్యార్థులు 930 మంది పట్టాలు స్వీకరిస్తారు. రెండో రోజు ఆదివారం పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు 1,067మంది అందుకుంటారు.
ముఖ్య అతిథి టెక్సాస్ ఇండియా ఎండీ
స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా టెక్సాస్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సంతోశ్‌కుమార్ హాజరై పట్టాలు అందజేస్తారు. స్నాతకోత్సంలో నిట్ చైర్‌పర్సన్ సేయాంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ చైర్మన్ బీవీఆర్ మోహన్‌రెడ్డి అధ్యత వహించనున్నా రు. ప్రతీ విభాగంలో టాపర్లకు గోల్డ్‌మెడల్, ఓవరాల్ టాపర్‌కు ఇన్‌స్టిట్యూట్ గోల్డ్‌మెడల్‌తో పాటు ఇంజనీరింగ్ రంగంలో ప్రత్యేక పరిశోధనలకు ‘ఇన్నోవేటివ్ అప్లికేషన్స్ ఆఫ్ ఆటోమెటిక్ కంట్రోల్ టెక్నాలజీస్ టు ఏవియేషన్ అండ్ ఏరో స్పేస్ ఇంజనీరింగ్’ అంశంపై పరిశోధనలకు డాక్టర్ పద్మనాభన్ కె.మీనన్‌కు, ‘డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ, అడ్వాన్సింగ్ ఇండియాస్ సెమీ కండక్టర్ అంబీషన్స్ త్రూ విజనరీ టెక్నాలజీ లీడర్ షిప్’ అంశంపై పరిశోధనలకు ఆనంద్ రామమూర్తికి గౌరవ డాక్టర్ ఆఫ్ ఫిలా సఫీ (పీహెచ్‌డీ) పట్టాలు అందజేయనున్నారు.
నిట్ వరంగల్‌లో నేడు, రేపు పట్టాల అందజేత
స్వీకరించనున్న 1,997 మంది
విద్యార్థులు
విద్యార్థి జీవితంలో కీలక ఘట్టం : నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ


