జనగామ రూరల్: రాజీమార్గంతోనే కక్షిదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.ప్రతిమ అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, న్యూ ఢిల్లీ తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 12న శనివారం జాతీయ లోక్ అదాలత్‌ను నిర్వహించుతున్నట్లు తెలిపారు. ఇందులో రాజీకి పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్కుబౌన్స్ కేసులు పరిష్కరించబడుతాయన్నారు. లోక్ అదాలత్‌ను కక్షిదారులు, న్యాయవాదులు సద్వినియోగించుకోవాలన్నారు.
జెడ్పీసీఈఓగా బాధ్యతల స్వీకరణ
జనగామ రూరల్: జెడ్పీసీఈఓగా పి.బలరాం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో పని చేసిన రంగారావు పదవీ విరమణ పొందగా ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీలో పనిచేసిన బలరాం బదిలీపై జనగామ జెడ్పీసీఈఓగా బాధ్యతలు చేపట్టారు.
16న ప్రత్యేక అవసరాల పిల్లల గుర్తింపు శిబిరం
జనగామ రూరల్: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు వైద్య పరికరాల గుర్తింపు శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమగ్ర శిక్ష భారత కృత్రిమ అవయవాల తయారీ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈనె 16న (బుధవారం) ఉదయం 10 గంటల నుంచి జనగామ కోర్టు సమీపంలోని బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి ప్రత్యేక అవసరాలు గల పిల్లల వైద్య పరిశీలన, ఉచిత పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్ యూడీఐడీ కార్డ్, ఆధార్ కార్డు, 2 పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులు పాల్గొనాలన్నారు. విద్యార్థుల వైకల్య శాతాన్ని పరిశీలించి అవసరమైన వినికిడి యంత్రాలు, వీల్ చైర్లు, కాలీపర్స్, ట్రై సైకిళ్లు, ఇతర సహాయక పరికరాలను అంచనా వేసి ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఎన్‌ఎస్‌యూఐ ఆరు
జిల్లాల అధ్యక్షుల నియామకం
సాక్షి ప్రతినిధి, వరంగల్: కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్‌ఎస్‌యూఐ బలోపేతంపై అధి ష్టానం దృష్టిపెట్టింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ఆరు జిల్లాలకు నూతన జిల్లా అధ్యక్షులను నియమించారు. సంఘం జాతీయ అధ్యక్షుడు వినోద్ ఝాకర్ ఆమోదంతో రాష్ట్ర అధ్యక్షుడు యాదవల్లి వెంకటస్వామి బుధవారం ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండకు వేణుచారి, వరంగల్–బొల్లం నితిన్‌కుమార్, జనగామ–దేశగాని హరగోపాల్‌గౌడ్, జయశంకర్ భూపాలపల్లి–పురుషోత్తం అనూప్, మహబూబా బాద్ – బి.చంటి, ములుగు–ఎం.నవనీత్‌ను నియమించారు. కొత్తగా నియమితులైన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆయా జిల్లాల్లో విద్యార్థుల సమస్యలను గుర్తించి పోరాటాలు చేపట్టడంతోపాటు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకలాపాలను విస్తరించే అవకాశం ఉంది.
అమృత్ భారత్ పనుల తనిఖీ
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో జరుగుతున్న అమృత్ భారత్ నిర్మాణ పనులను బుధవారం సికింద్రాబాద్ రైల్వే డీఈఎన్ సెంట్రల్ అధికారి ప్రంజల్ కేశర్‌వాణి తనిఖీ చేశారు. కాజీపేట అమృత్ భారత్ పనులు, స్టేషన్ ఎదుట ఉన్న సర్క్యులేటింగ్ ఏరియాలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన తనిఖీ చేసి అభివృద్ధి పనుల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని స్థానిక అధికారులకు, కాంట్రాక్టర్లకు పలు సూచనలిచ్చారు. ఈతనిఖీలో కాజీపేట ఐఓడబ్ల్యూ శ్రీనివాస్, స్థానిక రైల్వే సూపర్‌వైజర్లు, వర్క్ సూపర్‌వైజర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆర్టీసీ తాత్కాలిక బస్టాప్
కాజీపేట రైల్వేస్టేషన్‌లో అమృత్‌భారత్ అభివృద్ధి పనుల నేపథ్యంలో స్టేషన్ ముందున్న ఆర్టీసీ లోకల్ బస్టాప్‌ను రైల్వే అధికారులు కాజీపేట రైల్వే స్టేడియానికి బుధవారం తరలించారు. పనులు పూర్తయ్యేవరకు ఇక్కడి నుంచే ప్రయాణికులు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని హనుమకొండ లోకల్ బస్ ఆర్టీసీ డిపో మేనేజర్ ధరంసింగ్ తెలిపారు.


